జూబ్లీహిల్స్ పబ్ ఘటన రాజకీయ దుమారానికి కారణమైంది. నిందితుల్లో హోంమంత్రి మహమూద్ అలీ మనవడు ఉన్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హోంమంత్రి మనవడి ప్రమేయం ఉన్నందునే పోలీసులు చర్యలకు వెనుకాడుతున్నారని అటు బీజేపీ నేతలు, ఇటు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
అత్యాచారం కేసులో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే రఘునందన్ రావు తప్పుపట్టారు. ఘటన జరిగిన మూడు రోజులకి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై మండిపడ్డారు. సీసీ ఫుటేజీని మాయం చేశారని.. పబ్ లోకి మైనర్లను ఎలా అనుమతిస్తారని నిలదీశారు. నగరంలో ఇంత ఘోరం జరిగితే ప్రభుత్వ పెద్దలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పబ్ కల్చర్ పరాకాష్టకు చేరిందని విమర్శించారు కాంగ్రెస్ నేత శ్రవణ్. అత్యాచార ఘటనలో టీఆర్ఎస్, ఎంఐఎం నేతల పిల్లలు ఉన్నారని పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. ఘటన 28న జరిగిందని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారన్న ఆయన.. 31న తండ్రి కంప్లయింట్ చేశాడని.. మరి.. ఇప్పటిదాకా గుడ్డిగుర్రం పళ్లు తోముతున్నారా? అని ప్రశ్నించారు. పోలీస్ శాఖ ఇన్నాళ్లు ఏం చేసిందని ప్రశ్నించారు.
పోలీసులు ప్రజలకు ఏం భద్రత కల్పిస్తారని ఫైరయ్యారు శ్రవణ్. సీసీటీవీ ఫుటేజ్ లో అమ్మాయిని తీసుకెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్న ఆయన.. పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ లో కారు నెంబర్ ఉంది గాని.. పేరు ఎందుకు లేదని నిలదీశారు. ఇక్కడే జరుగుతున్న వ్యవహారం అంతా అర్థం అవుతోందని అనుమానం వ్యక్తం చేశారు శ్రవణ్.