– అశ్లీల నృత్యాలు.. డ్రగ్స్ కు అడ్డాలు
– పెడదారిన యువత
– ఏదైనా ఘటన జరిగినప్పుడే హడావుడి
– తర్వాత అంతా షరామామూలే!
– పూర్తిస్థాయిలో చర్యలు ఎక్కడ?
– బాలిక అత్యాచార ఘటన పాపం ఎవరిది?
– మైనర్లను పబ్ కు రానిచ్చిన యాజమాన్యానిదా?
– కళ్లుండి చూడలేని ప్రభుత్వానిదా?
– మనకేం సంబంధం లేదనుకునే పోలీస్ శాఖదా?
– సర్కార్ అండతో తప్పించుకుంటున్న నేరస్థులదా?
– ప్రతిపక్షాల సూటి ప్రశ్నలు
పాలించేవాడు మనవాడే అయితే.. ఎన్ని తప్పులు చేసినా కాస్తాడు. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ తీరు అలాగే ఉందని అంటున్నాయి ప్రతిపక్షాలు. సంచలనం రేపిన అమ్నేషియా పబ్ వ్యవహారంలో ప్రభుత్వం, పోలీస్ శాఖ తీరు చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన చాలా రోజులకు విషయం వెలుగులోకి రావడం.. అసలు నిందితులను తప్పించే ప్రయత్నం చేశారని ప్రతిపక్షాలు బలంగా చెప్తున్నాయి. నిందితుల్లో ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని బల్లగుద్ది మరీ ఆధారాలు బయటపెడుతున్నాయి. అయినా కూడా పోలీసులు ఎమ్మెల్యే కుమారుడి వైపు దృష్టి పెట్టకపోవడంపై మండిపడుతున్నాయి.
ప్రభుత్వ అండతో ఎమ్మెల్యే కుమారుడిని తప్పించేందుకు పోలీస్ శాఖ.. చక్కని స్క్రీన్ ప్లే రన్ చేస్తోందని విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఘటనకు సంబంధించి ముగ్గురు మైనర్లు, ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అమ్నేషియా పబ్ లో మే 28న పార్టీ ఇచ్చింది ఎవరు? బాలికను తీసుకెళ్లిన ఇన్నోవా కారు ఎవరిది? కారులో సామూహిక అత్యాచారం జరిగితే రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారును పోలీసులు ఎందుకు స్వాధీనం చేసుకున్నారు? ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు కానీ, ఇన్నోవా కారు ఎక్కడుంది? ఇలా అనేక సందేహాలకు సమాధానాలు రావాల్సి ఉంది. అసలు.. కారును గుర్తించలేకపోతున్నారా? లేక కావాలనే సైలెంట్ చేస్తున్నారా? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కుమారుడు.. ఘటన జరక్కముందే అక్కడి నుంచి వెళ్లిపోయాడని స్పష్టంగా చెబుతున్న పోలీసులు.. ఇన్నోవా కారు ఎవరిదనే విషయంపై మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదనేది పెద్ద ప్రశ్న.
అత్యాచార ఘటనపై ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తే గానీ.. అటు అధికారుల్లో, ఇటు పోలీస్ శాఖలో చలనం రాని పరిస్థితి కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రతీసారి ఏదైనా ఘటన జరినప్పుడు నాలుగు రోజులు హడావుడి చేయడం తర్వాత షరామామూలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇప్పుడు కూడా జరిగింది కూల్ డ్రిక్స్ పార్టీ అని చెబుతున్నారు. పబ్ లోపల ఏం జరిగిందనేది బయటకు రానివ్వడం లేదు. అబ్కారీ శాఖ దాడులు చేసి మమ అనిపించేసిందని అంటున్నారు. ఆమధ్య ర్యాడిసన్ పబ్ కేసులో డ్రగ్స్ బయటపడ్డాయి. ఆ తర్వాత కొన్ని పబ్స్ లో అశ్లీల నృత్యాల వ్యవహారాలు బయటకొచ్చాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం ఎందుకు ఉండడం లేదనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది.
పబ్ లు డ్రగ్స్ కు అడ్డాలుగా మారి యువత చెడిపోతున్నా.. బడా బాబుల పిల్లలు పెడదారిలో వెళ్తున్నా.. టీఆర్ఎస్ ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించడానికి ఆదాయమే ప్రధాన కారణంగా చెబుతున్నారు ప్రతిపక్ష నేతలు. ఖజానాకు వందల కోట్ల ఆదాయాన్ని తెచ్చి పెడుతున్న పబ్ లపై సరైన దృష్టి పెట్టకపోవడం వల్లే తరచూ అఘాయిత్యాలు వెలుగుచూడాల్సి వస్తోందని విమర్శిస్తున్నారు. అసలు.. రాష్ట్రంలో పబ్ లే లేకుండా చేయాలనే వాదనను తెరపైకి తెస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రతీసారి తమకు తెలిసినవాళ్లు నేరం చేయడం.. వారిని సైడ్ చేయడం ఎందుకు.. ఈ పబ్ లో గోలే లేకుండా ఉంటే బాగుంటుంది కదా? అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ప్రతిపక్ష నేతలు.