రాచరికపు రంగులో గులాబీ దండు..
ఓ వైపు విద్యార్థులు.. మరో వైపు రైతులు..
బలిదానాలపైన బలిపీఠం ఎక్కి పాలన..
బంగరు తెలంగాణ పేరుతో బరిబాత..
ఇక నీ రాచరికానికి చరమగీతం..
ప్రతిపక్షాల మండిపాటు
కడుపులు ఎండి ఒకడు ఏడిస్తే.. కక్కతిని ఇంకొకడు ఏడ్చినట్టు ఉంది ఈ తెలంగాణ లో పాలకుల పరిస్థితి. వందలాది మంది యువకుల సమాధులు పైన పీఠమేసుకొని రాజ్యాన్ని ఏలుతున్నారు. ఎందరో విద్యార్థులు ఆత్మ బలిదానాల సాక్షిగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాలకులు బర్త్ డే వేడుకలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ.. నోటిఫికేషన్లు లేక నిరుద్యోగ యువత.. పండించిన ధాన్యానికి మద్దతు ధర లేక.. పంటకు నష్ట పరిహారం రాక, చేసిన అప్పులు చెల్లించ లేక రైతన్నలు ఆత్మాహుతిలో అగ్గై.. ఎండిన ఆకుల లెక్కన రాలిపోతున్నారు. ప్రభుత్వ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ఉద్యోగులు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకే మీకు బర్త్ డేలు.. మాకు డెత్ డేలా..? అని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు ప్రజలు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కేసీఆర్ బర్త్ డే సందర్భంగా టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఉస్మానియా యూనివర్శిటీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తోంది. దీనిపై యునివర్సిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేశారు. దీంతో విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. పొలీసులు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు స్పందించాయి. ఒక పక్క నోటిఫికేషన్స్ రాక నిరుద్యోగులు ఆత్మ హత్యలు చేసుకుంటుంటే.. మరో వైపు కేసీఆర్ బర్త్ డే పేరుతో టీఆర్ఎస్ నేతలు క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం సిగ్గుచేటు అని తీవ్ర స్ధాయిలో ధ్వజం ఎత్తారు. చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రాక.. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి చూసి విరక్తి చెంది నిన్న కాక మొన్న మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను రాసిన సూసైడ్ నోట్ లో చాలా క్లియర్ గా తన చావుకి ప్రభుత్వమే కారణం అని చెప్పాడు.
సీఎం కేసీఆర్ నోటిఫికేషన్స్ ఇస్తాడు అనే నమ్మకం పోయింది అని కూడా తన సూసైడ్ నోట్ లో రాశాడు. ఇప్పటికే అనేక మంది నిరుద్యోగ యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట నుంచి ఆత్మహత్య చేసుకున్న వార్త వినిపిస్తూనే వస్తోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే కనీస మానవత్వం లేకుండా కేసీఆర్ బర్త్ డే వేడుకలకు యూనివర్శిటీ ని వేదిక చేసుకొని సంబరాలు జరపడం అంటే పుండు మీద కారం చల్లడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. అయిన రాజ్యమే నాది అయినప్పుడు.. సిపాయిలదేముంది ఇక్కడ అని అనుకోవచ్చు కానీ.. రాజు కూడా రాజ్యాన్ని వదిలి పారిపోయే రోజు దగ్గర పడిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
నిరుద్యోగ యువకులు ఆత్మ బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రంలో.. ఇప్పుడు రైతులు వంతుకు వచ్చిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే కాదు.. ఉద్యోగులు సైతం ఊపిరొదులుతున్నారు. ప్రతి రోజు ముగ్గురు నలుగురు రైతులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించి ఒదార్చి ఆర్థికంగా ఆదుకొని భరోసా ఇవ్వాల్సింది పోయి.. ఎవడెక్కడ పోతే నాకేంది.. మూడుపూటలు తింటా ఫాం హౌస్ ల పంట అన్నట్టు వ్యవహరిస్తున్నారు సీఎం అని మండిపడుతున్నారు. ఇలా బాధ్యతారహితంగా వ్యవహరించడం దుర్మార్గం అని పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మండి పడుతున్నారు.
ప్రభుత్వం కానీ.. మంత్రులు కానీ.. ఎమ్మెల్యేలు కానీ ఆత్మహత్యలు చేసుకున్న బాధిత కుటుంబాలకు మేమున్నాం అని కనీస భరోసా ఇవ్వలేని దుర్భర స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. మీదికెళ్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం.. మీ మాటలిని ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం.. గృహ నిర్బంధాలకు పాల్పడడం.. అరెస్టు చేయడం లాంటి చర్యలకు పూనుకోవడం.. ఇదేనా మీ పాలనా.. ఇదేనా మీరు తెస్తామన్న బంగారు తెలంగాణ అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కేసీఆర్ కు మానవత్వం లేదు అని అర్థం అవుతుందని అంటున్నారు. అంతేకాదు మీకు డెత్ డేలు.. మాకు మాత్రం బర్త్ డేలు అన్న విధంగా తన బర్త్ డే సందర్భంగా తమ పార్టీ విద్యార్థి విభాగం వారితో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అంటే కేసీఅర్ లో ఉన్న దోరాహంకారానికి అద్దం పడుతోందని విపక్ష నాయలు అంటున్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఆత్మ బలిదానాలే ద్దిక్కు అయ్యాయి.. ఇలాంటి దుర్మార్గమైన టీఆర్ఆర్ పాలన మాకు వద్దు అంటూ ఉద్యమించాలి అని పిలుపునిస్తున్నారు.