ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి రెండు సార్లు ప్రధానిగా చేస్తే సరిపోతుందని, ఇక చాలు అని ఓ ప్రతిపక్షనేత తనతో గతంలో అన్నట్టు ఆయన తెలిపారు. అయితే ఆయన సూచనను తాను సున్నితంగా తిరస్కరించినట్టు ప్రధాని మోడీ తెలిపారు.
ఇక చాలు అని సరిపెట్టుకునే స్వభావం తనది కాదని ఆయనతో అన్నట్టు ప్రధాని తెలిపారు. గుజరాత్ లోని భరూచ్ లో ఏర్పాటు చేసిన ఉత్కర్ష్ సమారోహ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన….
ఒక రోజు ఒక సీనియర్ నాయకుడు తన వద్దకు వచ్చారని మోడీ తెలిపారు. ఆయన తనను రాజకీయంగా ప్రతిసారీ విమర్శిస్తారని ఆయన అన్నారు. కానీ అతన్ని తాను ఎప్పుడూ గౌరవిస్తానని పేర్కొన్నారు.
అతను కొన్ని అంశాలపై సంతోషంగా లేడని, అందుకే ఓ రోజు తనను ఆ నేత కలిశాడని వెల్లడించారు. దేశం మిమ్మల్ని రెండు సార్లు ప్రధానిగా చేసిందని తనతో ఆయన అన్నారని చెప్పారు. ఇంతకు మించి మీకు ఇంకేం కావాలని ఆయన అడిగినట్టు మోడీ పేర్కొన్నారు.
మోడీ ఒక విభిన్నమైన వ్యక్తి అని అతనికి తెలియదన్నారు. గుజరాత్ నేలే తనకు ఇలాంటి గుర్తింపునిచ్చినట్టు అతనితో చెప్పారని ఆయన వెల్లడించారు. అయిందేదో అయింది.. ఇక అవన్నీ వదిలేసి విశ్రాంతి తీసుకుందామని అనుకునే స్వభావం తనది కాదన్నారు.
సంక్షేమ పథకాలను వందశాతం అమలు చేసి, పూర్తి సంతృప్తికర స్థాయికి ప్రజలను చేర్చాలన్నదే తన కల అని అన్నారు. అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్రమించబోనని స్పష్టం చేశారు.