సీఎం కేసీఆర్ జగిత్యాలలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన నాయకులను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పోలీసులు తమను అక్రమంగా నిర్బంధించారని అరెస్ట్ అయిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో కనీసం నిరసన కూడా వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా లేదా అంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, కేసీఆర్ ఆగడాలను ప్రజలకు గమనిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
బస్టాండ్ వద్ద జనం అవస్థలు
కేసీఆర్ జగిత్యాల టూర్ నేపథ్యంలో జన సమీకరణ కోసం ఆర్టీసీ బస్సులను ఉపయోగించారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జిల్లా కేంద్రం మీదుగా రోజూ రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు ఆర్మూర్, నిజామాబాద్, కోరుట్ల, ధర్మపురి, కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు.
మరోవైపు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సెల్ఫ్ హాలిడే ఇచ్చాయి. ప్రభుత్వ కాలేజీలు ఉండడంతో గ్రామాల నుండి వచ్చే విద్యార్థులు బస్సులు లేక ఇబ్బందులు పడ్డారు. చేసేదిలేక ప్రైవేట్ వాహనాలు ఆశ్రయించగా.. డబుల్ చార్జీలను వసూలు చేశారని ప్రయాణికులు వాపోయారు.