కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ దూకుడు ప్రదర్శిస్తున్నారా..? 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నారా..? ఎన్డీఏ కూటిమిని గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే పనుల్ని వేగవంతం చేశారా..? ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాల్ని పరిశీలిస్తే అదే అనిపిస్తుంది. రాహుల్ గాంధీ కొత్త అవతారం ఎత్తినట్లు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా ఆయన చాలా చురుగ్గా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రతిపక్ష నాయకులతో సమావేశం తర్వాతే ఆయన ఈ దూకుడు ప్రదర్శిస్తున్నారు.
గత పార్లమెంట్ సమావేశాల సమయంలో రాహుల్ లో ఇంత స్పీడ్ లేదు. దానికి కారణం ఆ సమయంలో సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో నిరాశ చెందారు. కానీ.. ఈసారి అలా కాదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ టార్గెట్ గా ఘాటైన విమర్శలు చేస్తూనే.. ఐక్యతా రాగాన్ని అందుకున్నారు. ప్రతిపక్షాలని ఒకే గొడుకు కిందకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న విశ్లేషకులు… సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ శ్రేణుల్లో రాహుల్ ధైర్యం నింపుతున్నారని అంటున్నారు.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రతిపక్షాలన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి. దానికి రాహుల్ గాంధీ నాయకత్వం వహించారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు. తర్వాత బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. అక్కడ కూడా రాహుల్ గాంధీ తన మార్క్ చూపించారు. అందరం కలిసి ఎలా ముందుకెళ్లాలి.. ఉమ్మడి దృష్టితో ఎలా పని చేయాలి.. అనే అంశాలపై నేతలకు వివరించారు.
ముఖ్యంగా పెగాసస్ వ్యవహారంలో ప్రతిపక్షాలు అంత గట్టిగా నిలబడడానికి రాహుల్ వ్యూహాలే కారణమని చెబుతున్నారు పార్టీ నేతలు. అంతేనా.. ప్రతిపక్ష నేతల చేత సైకిల్ యాత్ర చేపట్టి సక్సెస్ అయ్యారని అంటున్నారు. కొన్నాళ్లుగా రాహుల్ అనుసరిస్తున్న వ్యూహాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు.. ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి 2024 ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోందని అనుమానిస్తున్నారు.