లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్షాలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ప్రతిపక్షాలు ఇందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే సోమవారం ఈ పార్టీలు ఇందుకు పూనుకోవచ్చునని వెల్లడైంది. ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలంటే విపక్షాలకు లోక్ సభలో కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం.
ఈ సంఖ్యను సాధించడానికి కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్షాల సపోర్ట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. రాహుల్ గాంధీ అనర్హత సమస్య, అదానీ అంశంపై జేపీసీ వేయాలన్న తమ డిమాండ్ నేపథ్యంలో ఇవి కలిసికట్టుగా స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే యోచన చేస్తున్నాయి.
కానీ ఇది జరగాలంటే మొదట పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాల్సి ఉంటుంది. అయితే విపక్షాల రభసతో ఉభయ సభలూ ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకుండానే వాయిదా పడుతున్నాయి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారంతో ముగియవచ్చునని కూడా తెలుస్తోంది. ఒకవేళ ఈ పరిస్థితి ఏర్పడిన పక్షంలో స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న విపక్షాల యోచన కేవలం యోచనగానే మిగిలిపోతుందా అని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.