ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించేందుకు సోమవారం సాయంత్రం ప్రతిపక్షాలు సమావేశం కానున్నాయి. వివాదస్పద పౌరసత్వ చట్టం, ఎన్.ఆర్.సి, విద్యార్ధుల నిరసనల నేపధ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా ప్రతిపక్షాల ఐక్యతను చాటాలనుకుంటున్నప్పటికీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సమావేశానికి హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని వారు ఇప్పటికే ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇటీవల జరిగిన దేశవ్యాప్త సమ్మెలో పశ్చిమ బెంగాల్ లో తృణమూల్, వామపక్ష కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. సీఏఏ పై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ రెండు సంఘటనలతో మనస్థాపం చెందిన మమత తాను కాంగ్రెస్ నేతృత్వంలో ఢిల్లీలో జరిగే మీటింగ్ కు హాజరుకాబోనని ప్రకటించారు. విపక్షాలు సమావేశం కావాలనే ఐడియా తాను ఇచ్చిందేనని గుర్తు చేశారు.