– ఇంగ్లీష్ ఆప్షనల్.. అంతా హీందీలోనే..!
– పార్లమెంటరీ ప్యానల్ నిర్ణయంపై నిరసనలు
– బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేసిన విపక్షాలు
భారతదేశంలో చాలా భాషలున్నాయి. ఎక్కవమంది హిందీ మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానల్ చేసిన ప్రతిపాదనలు చర్చనీయాంశంగా మారాయి. భారతీయులకు ఇంగ్లీష్ ని దూరం చేయడమే లక్ష్యంగా.. విద్యాసంస్థల్లో హిందీ మీడియం మాత్రమే ఉండేలా.. ప్రభుత్వ ఆఫీసుల్లో వ్యవహారాలు, ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ హిందీలోనే జరిగేలా సూచనలు చేసింది.
టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యాసంస్థలతో పాటు సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ.. హిందీ మీడియమే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఇంగ్లీష్ ను ఆప్షనల్ గా మార్చాలని ప్రతిపాదించింది. మొత్తం 112 సిఫారసులతో.. తన 11వ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది కమిటీ. ఈ ప్రతిపాదనలపై పలు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదనలపై కేరళ సీఎం విజయన్ మండిపడ్డారు. ఇంగ్లీష్ ను పక్కనపెట్టడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఒకే భాషను దేశ భాషగా పరిగణించలేమని, ఈ విషయంలో ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు మోడీకి లేఖ రాశారు కేరళ సీఎం. అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ చేసిన ప్రతిపాదనలపై వెంటనే స్పందించాలని అందులో కోరారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ దీనిపై స్పందిస్తూ.. హిందీని తప్పనిసరి భాషగా పేర్కొంటూ మరో భాషాయుద్ధం ప్రారంభించవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. అలాంటి ప్రయత్నాలను విరమించుకొని భారతదేశ ఐక్యతను కాపాడాలని ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సిఫార్సులను అమలు చేస్తే దేశ ఐకత్య నాశనం అవుతుందని తెలిపారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ లో తమిళంతో సహా 22 భాషలను సమాన హోదా ఇచ్చారని స్టాలిన్ గుర్తు చేశారు. దేశంలో హిందీని ఉమ్మడి భాషగా సిఫారసు చేయడానికి ప్యానెల్ కు ఎందుకు అవసరం వచ్చిందని ప్రశ్నించారు.
ఇక ఈ వివాదంపై తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్యానెల్ సిఫారసుకు వ్యతిరేకంగా తన అభిప్రాయాలను ట్వీట్ చేశారు. భారతదేశానికి జాతీయ భాష లేదని, అనేక అధికారిక భాషల్లో హిందీ కూడా ఒకటి తెలిపారు. “ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ రిక్రూట్ మెంట్లలో హిందీని తప్పనిసరి చేయడం ద్వారా, ఎన్డీఏ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తోంది” అని అన్నారు. భారతీయులకు భాష ఎంపిక ఉండాలి అని చెప్పారు కేటీఆర్.
మరోవైపు పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై.. విద్యా నిపుణులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ లేకపోతే పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడం సాధ్యం కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్జెక్ట్ ఉండి.. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక.. ఎంతోమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని చెబుతున్నారు. ప్రపంచంతో పోటీ పడే నిర్ణయాలు తీసుకోవాలి గానీ.. భావి పౌరుల జీవితాలతో ఆడుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ చదువులకు, అక్కడ ఉద్యోగాలకు ఇంగ్లీష్ తప్పనిసరి అని.. ఇలాంటి నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తాయని మండిపడుతున్నారు.