– 8 ఏళ్లలో కేసీఆర్ ఏం సాధించారు?
– 6 ఉన్న పబ్స్ 89 అయ్యాయి..
– రూ.10 వేల కోట్లు ఉన్న ఎక్సైజ్ ఆదాయం..
– రూ.36 వేల కోట్లకు చేరింది
– కిలోలకు కిలోల గంజాయి నగరానికి చేరుతోంది
– మద్యం తాగించడం.. డ్రగ్స్ ను ప్రోత్సహించడం..
– ఇదేనా కలలు గన్న తెలంగాణ?
– నిలదీస్తున్న విపక్షాలు
గల్లీల్లో గంజాయి.. పబ్బుల్లో డ్రగ్స్.. ఎటుచూసినా మద్యం షాప్స్… ఇదేనా బంగారు తెలంగాణ? ఇదేనా మన సంస్కృతి?. సమైక్య పాలనలో ఎన్నో అవమానాలు.. ఎన్నో ఘోరాలు. కానీ.. కలలు గన్న తెలంగాణ.. ఈ 8 ఏళ్లలో సాధ్యమైందా? అని అంటే.. ఎవరి దగ్గరా సమాధానం లేదు. టీఆర్ఎస్ నేతలు ఎంత డబ్బా కొట్టుకున్నా.. చాలా విషయాల్లో ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్నలకు వితండవాదంతో వస్తున్న సమాధానాలే గానీ.. సూటిగా చెబుతున్న ఆన్సర్ ఒక్కటి కూడా ఉండడం లేదనేది వాస్తవం.
మిగులు రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారింది. మరి.. మన సంస్కృతీ, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారా? అంటే అదీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగ నిర్వహణలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ జాగృతి. కేసీఆర్ కుమార్తె కవిత కనుసన్నల్లో రాష్ట్రాలు, దేశాలు దాటి బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కానీ.. ఆమె ఎప్పుడైతే ఎంపీగా ఓడిపోయారో.. అప్పటినుంచి స్పీడ్ తగ్గింది. అంటే.. బతుకమ్మ పండుగను రాజకీయ అవసరాల కోసమే వాడుకున్నారనేది దీన్నిబట్టే అర్థం అవుతోందని అంటున్నారు ప్రతిపక్ష నేతలు.
ఇక కేసీఆర్ సంగతే వేరు. తానే గొప్ప హిందువునని యాగాలు.. పూజలు అంటూ అప్పుడప్పుడు హడావుడి చేస్తుంటారు. దేవుడ్ని నమ్మడంలో తప్పులేదు. కానీ.. దేవుడి ముసుగులో రాజకీయాలు కరెక్ట్ కాదనేది విపక్షాల వాదన. కేసీఆర్ కు భక్తి ఉంటే సరిపోతుందా? మిగిలిన నాయకులకు ఉండాలిగా. ఓ ఎమ్మెల్యే రాముడిని అవమానిస్తాడు. ఇంకొకరు నోటికొచ్చినట్లు మాట్లాడతారు. రాష్ట్రంలో ఎన్నో అల్లర్లు జరుగుతున్నా ఒక వర్గం వైపే ఉంటున్నారు. అయినా.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై గౌరవం ఉన్న వాళ్లు ఎవరైనా కేసీఆర్ టీమ్ లో ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఉద్యమాన్ని అవమానించిన వారినే కేసీఆర్ నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారని గుర్తు చేస్తున్నాయి.
మద్యం విషయంలో కేసీఆర్ ను రకరకాల పేర్లతో విపక్ష నేతలు విమర్శలు చేస్తుంటారు. దానికి కారణం లేకపోలేదు. ఆయనకున్న అలవాట్ల సంగతి ఏమోగానీ.. ఎటుచూసినా మద్యం షాపులు కనిపిస్తుండడంతో ప్రతిపక్షాలకు ఇదో ప్రధాన ఆయుధంగా మారింది. ఏడేళ్ల కిందట మద్యంపై రూ.10 వేల కోట్లు ఉన్న ఎక్సైజ్ ఆదాయాన్ని రూ.36 వేల కోట్లకు పెంచారు కేసీఆర్. దీన్నిబట్టి చూస్తుంటే తెలంగాణ ప్రజలను తాగుబోతులుగా మార్చే కుట్ర జరుగుతోందని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. విచ్చలవిడిగా మద్యం తాగించడమే మన సంస్కృతా అని ప్రశ్నిస్తున్నాయి.
పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సింది పోయి.. బెల్టు షాపులు, మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ తాగుబోతులను తయారు చేస్తున్నారని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. ఇక పబ్ ల సంగతి సరేసరి. హైదరాబాద్ లో ఒకప్పుడు 6 పబ్ లు మాత్రమే ఉండేవి. ఇప్పుడవి 89కి చేరాయి. మన సంస్కృతి, సంప్రదాయాలు అంటూ స్టేజీలపై వీర లెవల్ లో సూక్తులు చెబుతూ.. ఇంకోవైపు పబ్ కల్చర్ ను ప్రోత్సహిస్తూ యువతను నాశనం చేస్తున్నారని అంటున్నారు విపక్ష నేతలు. మొన్నీమధ్య ర్యాడిసన్ బ్లూ పబ్ వ్యవహారం ఎంతటి సంచలనం అయిందో చూశాం. దీనిపై అనేక కథనాలు తెరపైకి వచ్చాయి.
కేసీఆర్ పాలనలో తెలంగాణ సంస్కృతి విచ్ఛిన్నం అవుతోందని చెప్పడానికి మద్యం, డ్రగ్స్ కు ఇస్తున్న ప్రోత్సాహమే నిదర్శనమనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఇక గంజాయి విషయానికొస్తే.. రాష్ట్రంలో ఎక్కడ వాహనం ఆపి తనిఖీలు చేసినా.. వందలాది కిలోలు దొరుకుతున్న పరిస్థితి. విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నా.. యువత ముత్తుకు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆరోపిస్తున్నాయి. ఈమధ్యే డ్రగ్స్ ఓవర్ డోస్ అయి ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన తర్వాత కాస్త హడావుడి నడిచినా.. తర్వాత షరా మామూలుగానే మారిందనే విమర్శలు ఉన్నాయి.
తెలంగాణ సంస్కృతి అంటే ఇదేనా? మద్యం తాగించడం.. మత్తుకు యువతను బానిసలను చేయడం.. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు. గంజాయి, డ్రగ్స్, పబ్స్ కు తెలంగాణను కేరాఫ్ గా మారుస్తున్నారని ఫైర్ అవుతున్నారు.