పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. . . రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంటుకు చేరుకున్నారు. అయితే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని పలు విపక్షాలు నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్, ఆప్, బీఆర్ఎస్ వంటి పార్టీల ఎంపీలు ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నారు. ఇది రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఉభయ సభల నుద్దేశించి చేస్తున్న ప్రసంగం. అయితే కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే, ఇతర విపక్ష నేతలు ఈ కార్యక్రమానికి గైర్ హాజరు కావడం పార్లమెంటు పట్ల ఈ దేశం పట్ల వారు చూపుతున్న అగౌరవానికి నిదర్శనమని బీజేపీ నేత అమిత్ మాలవీయ తీవ్రంగా తప్పు పట్టారు.
శ్రీనగర్ లో వాతావరణం బాగులేని కారణంగా విమానాలు ఆలస్యం కావడం వల్ల అక్కడినుంచి తమ నేత ఖర్గే, ఇతర నాయకులు పార్లమెంటుకు హాజరు కాజాలరని కాంగ్రెస్ సీనియర్ నేత జై రామ్ రమేష్ ప్రకటించిన అనంతరం.. అమిత్ మాలవీయ స్పందిస్తూ.. నిన్న రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో బిజీగా ఉన్న ఆ పార్టీ నేతలు నేడు పార్లమెంటుకు రాలేకపోతున్నామని చెబుతున్నారని, ఇది రాజ్యాంగ విలువలపట్ల వారికి గౌరవం లేదని సూచిస్తోందని అన్నారు.
బీఆర్ఎస్, ఆప్ పార్టీల తరువాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ‘విమానాల ఆలస్యాన్ని’ సాకుగా చూపి రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తోందని బీజేపీకే చెందిన మరో నేత, ఈ పార్టీ అధికార ప్రతినిధి షెహ్ జాద్ పూనావాలా విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించే అత్యున్నత వేదిక పార్లమెంట్ అని, విపక్ష ఎంపీలు ఈ సంగతి తెలుసుకోవాలని ఆయన అన్నారు.
తమరాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైనందుకు నిరసనగా తాము రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ నేత కె. కేశవరావు వ్యాఖ్యానించగా, ఆప్ కూడా ఇదే విమర్శ చేసింది. మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించింది.