దేశ ఆర్ధిక రంగానికి సవాలుగా నిలిచిన అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేతగానీ, సుప్రీంకోర్టు చేతగానీ విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అదానీ గ్రూపు నిర్వాకాలపై హిండెన్ బెర్గ్ నివేదిక ప్రచురించిన అంశాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో తక్షణమే చర్చ జరగాలని 11 ప్రతిపక్షాలు కోరుతున్నాయి. గురువారం ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఈ అంశంపై తామిచ్చిన వాయిదాల తీర్మానాలమీద చర్చ జరపాలని విపక్ష సభ్యులు కోరారు.
అయితే వీరి నిరసనల కారణంగా మధ్యాహ్నం 2 గంటలవరకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. కానీ తిరిగి సమావేశమైనప్పటికీ రభస కొనసాగడంతో ఉభయసభలనూ రేపటికి వాయిదా వేశారు. అదానీ అంశంపై తమ డిమాండుకు ప్రభుత్వం అంగీకరించేంతవరకు తమ నిరసన కొనసాగుతుందని ప్రతిపక్ష నేతలు తెలిపారు. ఇది దేశ ఆర్ధిక రంగానికి, కోట్లాది భారతీయుల భవితవ్యానికి సంబంధించిందని వారన్నారు.
ప్రధాని మోడీకి అదానీ సన్నిహిత సహచరుడని, మరి ఈ విషయంలో మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించారు. ఎల్ ఐ సి లో లక్షలాది మంది తమ పెట్టుబడులు పెట్టారని, అదానీ షేర్లలో ఈ సంస్థ వీటిని ఇన్వెస్ట్ చేసిందని ఆయన చెప్పారు.
ఇంకా బీఆర్ఎస్, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి వివిధ విపక్ష నేతలు ఆయనతో ఏకీభవించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేంత వరకు సభా కార్యకలాపాలను స్తంభింపజేస్తామన్నారు.