తెలంగాణ రాజకీయాల్లో ఇదో కొత్త అధ్యాయం. ఏడేళ్లుగా ఎన్నికలప్పుడే తప్ప ఎన్నడూ ఒకే వేదిక పంచుకోని ప్రతిపక్షాలు మొదటిసారి ‘చేతిలో’ చేయి వేశాయి. విడివిడిగా ఉన్నతమను దొంగ దెబ్బతీస్తూ,తమ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న అధికార టీఆర్ఎస్ పై..ఉమ్మడి పోరాటానికి అడుగు ముందుకేశాయి.కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ల ప్రజా వ్యతిరేక విధానాలపై యుద్ధం ప్రకటించాయి. పోడు భూముల సమస్యతో పాటు ఇతర ప్రభుత్వ వైఫల్యాలపై వరుస నిరసనలతో సమరం సాగించాలని నిర్ణయించాయి.
టీపీసీసీ చీఫ్ నేతృత్వంలో గాంధీ భవన్లో సమావేశమైన 12 పార్టీల ప్రతినిధులు..కేసీఆర్ ప్రభుత్వంపై చేసే పోరాటం కోసం కార్యాచరణను రూపొందించారు. ఈ మేరకు ఈ నెల 22వ తేదీన ధర్నాచౌక్లో మహాధర్నా నిర్వహించబోతున్నట్టుగా ప్రకటించారు రేవంత్ రెడ్డి. ధరణి లోపాలు,భూ నిర్వాసితుల సమస్యలు , వ్యాక్సినేషన్,పెట్రోల్,డీజీల్ ధరల పెంపు వంటి సమస్యలపై మహాధర్నా వేదికగా సీరియస్గా పోరాటం చేద్దామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 27న భారత్ బంద్ కు సంబంధించి పార్లమెంటరీ వారీగా కమిటీలు వేసుకొని, సన్నాహాక సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున బంద్ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఆదిలాబాద్ నుంచి అశ్వరావు పేట వరకు అన్ని పార్టీలు పోడు భూములపై రాస్తారోకో చేస్తాయని చెప్పారు.
పోడు భూముల సమస్యలపై ప్రతిపక్ష పార్టీల పోరాటం అనగానే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. వెంటనే పోడు భూములపై కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. కమిటీల పేరుతో కంటి తుడుపు చర్యలతో మేం ఊరుకోము. సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుంది.
-తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
కేసీఆర్, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం. 19 రాజకీయ పక్షాలు సోనియా గాంధీ నేతృత్వంలో చేయనున్న పోరాటాల ప్రణాళిక ప్రకారం.. ఇక్కడ కూడా బీజేపీ, టిఆర్ఎస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. సీపీఐ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొంటారు.
–చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై 22న మహా ధర్నా, 27న భారత్ బంద్, 30న జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు, అక్టోబర్ 5న పోడు భూముల సమస్యపై రాస్తారోకో వంటి పోరాటాలు ఉంటాయి. వాటిని విజయవంతం చేయాలి. అటవీ హక్కుల చట్టం, పోడు రైతుల సమస్యల పరిష్కారం అంశాలపై సర్కార్‌ను నిలదీయాలి.
-కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు
మోడీ, కేసీఆర్.. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చోద్యం చూస్తున్నారు. ధర్నా, రాస్తారోకోల పెద్దఎత్తున విజయవంతం చేయాలి. మోడీ, కేసీఆర్‌ల కళ్లు తెరిపించాలి.
Advertisements
-రంగారావు, సీపీఐ ఎం.ఎల్. కార్యదర్శి
కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, బాలమల్లేశ్, టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, చైర్మన్ అన్వేష్ రెడ్డి, సీపీఐ ఎం.ఎల్.ఎన్.డి కార్యదర్శి గోవర్ధన్, పోటు రంగారావు, నరసింహారావు, కె.రమ, సీపీఐ ఎం.ఎల్. లిబరేషన్ కార్యదర్శి రాజేష్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు సుధాకర్, ప్రదీప్.. పి.వై.ఎల్ కార్యదర్శి రాము పి.డి.ఎస్.యూ కార్యదర్శి రాము, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చామల కిరణ్ రెడ్డి, అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి, ఫిషర్ మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.