ఎట్టకేలకు పార్లమెంట్ లో సంయమనం పాటించాయి ప్రతిపక్షాలు. దానికి కారణం ఓబీసీ బిల్లు. రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని కట్టబెడుతూ తీసుకొచ్చిన ఈ బిల్లు లోక్‌సభలో చర్చకు వచ్చింది.
ఇప్పటికాదా పెగాసస్ వ్యవహారంలో పట్టు విడవకుండా ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు విపక్ష సభ్యులు. అయితే.. 127వ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో మాత్రం ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఓబీసీ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆందోళన చేయకుండా ఉన్నారు. తాము ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ తెలిపారు. ఇది కీలకమైన బిల్లు కాబట్టే తాము చర్చలో పాల్గొంటున్నామని చెప్పారాయన.
ఈ సవరణ బిల్లు వల్ల దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో సుమారు 4వేల మంది ఓబీసీలకు సీట్లు దక్కనున్నాయి. ఇంకొన్ని నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఓబీసీల మద్దతు కోసం కేంద్రం వ్యూహాత్మకంగా ఈ బిల్లును తీసుకొచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.