తెలంగాణ రాష్ట్రం లో విపక్షాలు ఉన్నా లేనట్లే. ఎందుకు ఈ మాట అన్నాల్సివస్తుంది అంటే ఆర్టీసీ కార్మికులు దృఢంగా, ధైర్యంగా కుటుంబసభ్యులను సైతం పస్తులతో ఉంచి వారు దాదాపు ఏబై రోజులు సమ్మె చేస్తే విపక్ష పార్టీలు వారికి మద్దతుగా సొంతగా ఎటువంటి కార్యక్రమం చేయలేదు. చేసినా మొక్కుబడి ఆందోళన కార్యక్రమం చేసారు. ఆర్టీసీ కార్మికుల దీక్ష శిబిరాలకు వెళ్లి సంఘీభావం చెప్పడం ఊకదంపుడు ఉపన్యాసలు చెప్పి రావడం లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టి సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం ప్రభుత్వాన్ని కేసీఅర్ ను మొక్కుబడిగా విమర్శించి చేతులు దులుపుకోవడం చేసారు తప్ప ఏం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి చేతులెత్తేసింది. తన శ్రేణులను కదిలించడం, ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టి ఆర్టీసీ సమ్మె పరిష్కారం అయ్యే దిశగా కార్యాచరణ చేపట్టింది లేదు. ఆ పార్టీలో రేవంత్ లాంటి వారు చేపడితే ఎవరిని అడిగి చేపట్టారు అంటూ బహిరంగంగా విమర్శలు చేయడం చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ అయితే ప్రకటనలకే పరిమితం అయ్యారు. సీల్పీ లీడర్ బట్టి పాత్ర కూడా మొక్కుబడిగానే ఉంది అని చెప్పవచ్చు. ఎందుకు ఇలా చేశారు… కేసీఅర్ తో లోపాయికారీ ఒప్పందం ఏమైనా ఉందా లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వచ్చిన అవకాశాన్ని రాజకీయ కోణంలో చూసి దానిని వాడుకొకపోగా కార్మికులకు న్యాయం కోసం అయినా కార్యాచరణ రూపొందించి ఉండాల్సింది.
కానీ అలా చేయలేదు. కేసీఆర్ తో లోపాయికారీ ఒప్పందం అయినా ఉండివుండాలి లేదా నాయకత్వం అసమర్థత అయినా అయుండాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. సమ్మె ప్రారంభంలో హడావిడి చేసిన బీజేపీ ఆతరువాత కాలంలో మెతపడినట్లు కనపడింది. ఆర్టీసీ జేఏసీ బీజేపీ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు కనపడింది. కానీ చివరిలో బీజేపీ కూడా చేతులు ఎత్తేసింది. వారి కేంద్ర పార్టీ సలహానా లేక స్థానిక నాయకత్వం చేతకాని తనమో తెలియదు కాని సమ్మెకు సంఘీభావంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించలేదు. కేవలం ఆర్టీసీ జేఏసీ వారు ఇచ్చిన కార్యక్రమాలకు హాజరుకావడం తప్ప.
ఇక వామపక్షాలు కూడా వాళ్ళ పార్టీ పూర్తి కాలం కార్యకర్తలు పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించారు తప్ప ఆ పార్టీలకు ఉండే అనుబంధ సంఘాలు కు సమ్మెకు మద్దతుగా కార్యాచరణ ఇవ్వలేదు. విద్యార్థి సంఘాలు ఉన్నాయి, యువజన సంఘాలు, మహిళ సంఘాలు, హమాలీ వర్కర్స్ యూనియన్ లు సింగరేణి సంఘాలు, ఆటో వర్కర్స్ యూనియన్స్ ఇలా అనేక ప్రజా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలను సమ్మెకు సంఘీభావంగా ఆందోళనలు చేసేవిధంగా కార్యాచరణ రూపొందిచలేదు. కారణం తెలియదు… ఇలా అన్ని విపక్షాలు చేష్టలు ఊడికి నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు. ఇన్ని రోజుల పాటు సమ్మె జరిగితే రాష్ట్రంలో ఎంత అలజడి ఉండాలి ఎలాంటి మిలిటెంట్ కార్యక్రమాలు జరిగి ఉండాలి.
చరిత్రలో ఇప్పటిదాకా ఇన్ని రోజులు సమ్మె జరిగిన సందర్భాలు చాలా తక్కువ. జరిగినా ఇపాటికి సమ్మె తీవ్రరూపందాల్చి మిలిటెంట్ దశకు చేరేది కాని ఈ సమ్మె ప్రారంభంలో ఎలా ఉందో యాబై రోజులకు చేరుకున్న అలాగే ఉంది. అలాగని కార్మికులు మెత్తబడ్డరా అంటే అలా కుడా లేరు. ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసినా లొంగలేదు. గట్టిగా నిలబడ్డారు… విధులలో చేరాలని గడువులు పెట్టినా చేరేదిలేదు అని తెగేసి చెప్పారు. కార్మికులు గట్టిగా మిలిటెంట్ గా నిలబడ్డా విపక్షాలు మాత్రం చేతులు ఎత్తేశాయి. భవిష్యత్తులో ఎవరు సమ్మెకు దిగే పరిస్థితి లేకుండా ప్రభుత్వం కాదు చేసింది విపక్షాలు అని చెప్పక తప్పదు.