కొన్ని రోజులుగా కేటీఆర్ సీఎం అన్న మాట ఎక్కువగా వినిపిస్తుంది. కేసీఆర్ వెంటనే కేటీఆర్ కు బాధ్యతలు అప్పజెప్పాలని డిమాండ్లు వినిపించాయి. కానీ అదే సమయంలో ప్రత్యర్థి పార్టీల నుండి కొత్త పాట మొదలైంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న మంత్రి ఈటెల రాజేందర్ కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యమంతో ఏర్పడ్డ రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు ఎందుకు… అన్నిటికీ సమర్థుడైన ఈటెల ఉన్నప్పుడు కేటీఆర్ ఎందుకు అంటూ ఉద్యమ నేత చెఱుకు సుధాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వంటి నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ కొడుకు అనే అర్హత కాదు పాలనకు కావాల్సింది అంటూ విమర్శించారు.
కేటీఆర్ సీఎం అనే డిమాండ్ కన్నా కూడా ఈటెల సీఎం అనే డిమాండ్ కు ప్రతిపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనూ పెద్దగా వ్యతిరేకత కనపడటం లేదు. స్వతహాగా మృదు స్వభావి, పైగా ఉద్యమ నాయకుడు… అందులోనూ బీసీ నేత. ఇంతకన్నా ఇంకేం కావాలి ఈటెలకు పదవి ఇచ్చేందుకంటూ వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
దీంతో పరిస్థితి చేయిదాటకముందే… ఈ సీఎం మార్పు అంశంతో పాటు కేటీఆర్ సీఎం అంశాన్ని కూడా పక్కన పెట్టకపోతే ఈటెల సీఎం అనే స్లోగన్స్ పెరుగుతూనే ఉండేలా ఉన్నాయి. తాజా పరిస్థితుల్లో కేసీఆర్ కూడా సీఎం మార్పు అంశాన్ని వాయిదా వేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు అన్న విశ్లేషణలు సాగుతున్నాయి.