ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజే సభలో గందరగోళం నెలకొంది. గ్యాస్ సిలెండర్ ధరల పెంపు, సీఏఏ కు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి పదే పదే అడ్డు తగిలారు. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తన ప్రసంగం ప్రారంభించగానే సమాజ్ వాదీ పార్టీకి చెందిన సభ్యులు సభ మధ్యలోకి దూసుకొచ్చి నిరసన వ్యక్తం చేశారు. కొందరు అక్కడే నేలపై కూర్చున్నారు. చాలా మంది సభ్యులు సీఏఏ, ఎన్.ఆర్.సి, ఎన్.ఆర్.పి కి వ్యతిరేకంగా ప్లకార్లుడు పట్టుకున్నారు. ముస్లింలను టార్గెట్ గా చేసుకొని సీఏఏ, ఎన్.ఆర్.సి ని రూపొందించినట్టు ఆరోపించారు. సభ్యులు పదే పదే అంతరాయం కలిగిస్తుండడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
గ్యాస్ సిలెండర్ ధరలను నిరసిస్తూ కొంత మంది ఎమ్మెల్యేలు సిలెండర్లను మోసుకొని సభలోకి వచ్చారు. కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో కూరగాయల ధరలను నిరసిస్తూ రిక్షా వాలాకు టమోటాలను పంపిణీ చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగో వార్షిక బడ్జెట్ ను మంగళవారం సభలో ప్రవేశపెట్టనుంది. సీఏఏ, ఎన్.ఆర్.సి లకు వ్యతిరేకంగా నిరసనను మరింత తీవ్రం చేయాలని విపక్షాలు నిర్ణయించాయి.