తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోంది అంటూ 2023-24 రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఇది సంక్షేమ బడ్జెట్ అని ప్రభుత్వ వర్గాలు చెబుతుంటే.. ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు. చెప్పేవి గొప్పలు చేసేవీ శూన్యం అన్నట్టుగా బడ్జెట్ ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసం చేసే బడ్జెట్ తీసుకొచ్చారన్నారు. నాలుగేళ్లు అయినా రైతాంగానికి రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. అత్యధిక ఎగవేత దళారులుగా రైతులపై ముద్ర పడుతుందన్న ఆయన.. రుణమాఫీపై బడ్జెట్ లో ఊసే లేదని.. చేస్తారా లేదా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు వేతనాలు మొదటి తేదీ రాకపోవడంతో ఈఎంఐలు సమయానికి చెల్లించలేకపోతున్నారన్నారు. మధ్యాహ్నం భోజనం వండే వారికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారని.. అవి కూడా రెండేళ్ళకు ఓసారి ఇస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కిట్ కు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదన్న ఈటల… అంగన్ వాడీలకు డబ్బు సరిగ్గా ఇవ్వకపోవడంతో ముక్కిపోయిన ఆహారం అందుతోందని ఆరోపించారు.
బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకోవడం తప్ప బడ్జెట్ లో ఏమీ లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ బడ్జెట్ తో బలహీన వర్గాలకు ఒరిగిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, స్థలాలు, రుణ మాఫీ ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. హరీష్ రావు అంకెల గారడి, మాయమాటలు తప్ప బడ్జెట్ లో ఏమీలేదని విమర్శించారు. గత బడ్జెట్ హామీలే ఇప్పటికీ అమలు కాలేదని గుర్తుచేశారు. ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. హామీలతోనే కేసీఆర్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని మండిపడ్డారు భట్టి.
బడ్జెట్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్లు వేశారు. ఇందులో సరుకు లేదు.. సంగతి లేదు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం అంకెల గారడీ బడ్జెట్ లా ఉందన్న ఆయన.. మొత్తానికి గందరగోళంగా ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘అంకెల గారడీ బడ్జెట్.. గందరగోళమైన బడ్జెట్.. ప్రజల స్పందన కరువైన బడ్జెట్.. ముఖ్యమంత్రి గారి మాటల్లో చెప్పాలంటే.. సరుకు లేదు, సంగతి లేదు.. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు.. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు.. అంతా వట్టిదే డబ్బా.. బభ్రాజమానం భజగోవిందం’’ అని అన్నారు బండి.
బడ్జెట్ పై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. భారీ అంకెలు ఉన్నాయే తప్ప గత బడ్జెట్ లెక్కలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ప్రభుత్వ హామీల లెక్కలు బడ్జెట్ లో చూపించడం లేదని విమర్శించారు. లిక్కర్ ఆదాయం బడ్జెట్ లో బాగా కనిపించిందన్న ఆయన.. ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశంపై క్లారిటీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఇది కలల బడ్జెట్ మాత్రమేనని వాస్తవ బడ్జెట్ కాదని ఎద్దేవ చేశారు.
హరీష్ రావు బడ్జెట్ పుస్తకం చాలా లావుగా ఉందని.. కానీ అందులో మ్యాటర్ లేదన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. క్యాన్సర్ రోగులు, గుండె రోగుల ప్రస్తావన బడ్జెట్ లో రాలేదని ఆయన మండిపడ్డారు. వీఆర్‌ఏ, ఆర్‌ఎంపీ లాంటి వాళ్ల గురించి చర్చే లేదన్నారు. విభజనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల గురించి బడ్జెట్ లో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరి గుట్టకు మెట్రో కావాలని డిమాండ్ చేశామని.. కానీ ప్రస్తావన లేదని మండిపడ్డారు. పుస్తకం తెచ్చి పాఠం చదివి వెళ్లారని ఎద్దేవ చేశారు.