– సీఎం చేయడం లేదనే ఫ్రస్ట్రేషనా?
– లేక.. సెంటిమెంట్ ను రగిలించే కుట్రా?
– కేటీఆర్ కామెంట్స్ పై హాట్ హాట్ చర్చ
– తెలంగాణ ఒక్క కేసీఆర్ వల్లే వచ్చిందా?
– అమరుల త్యాగాల సంగతేంటి చిన్నసారు!
– కేసీఆర్ వల్లే బండికి, రేవంత్ కు పదవులు వచ్చాయా?
– మరి.. రాష్ట్రం రాకుంటే మీకూ పదవులు వచ్చేవి కాదుగా?
– మీకు పదవీ వ్యామోహం లేదా?
– దళితుడ్ని సీఎం చేస్తానని మాట తప్పిందెవరు?
– కేటీఆర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల రివర్స్ ఎటాక్
రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజమే. తప్పును ఎత్తిచూపుతూ అధికార, విపక్షాల మధ్య అర్థవంతమైన చర్చ జరగాలి. అప్పుడే సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది. కానీ.. అసలు విషయాన్ని వదిలేసి.. కేవలం తిట్టుకోవడానికే విమర్శలు చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. తాజాగా వరంగల్ టూర్ లో కేటీఆర్ వ్యాఖ్యలను చూసిన ప్రతిపక్ష నేతలు.. చిన సారులో ఇంత ఫ్రస్ట్రేషన్ ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.
గురువింద గింజ తన కింద నలుపు ఎరుగదంటారు పెద్దలు. అచ్చం అలాగే.. కేటీఆర్ వ్యాఖ్యలు చూశాక ఆ సామెత గుర్తుకొచ్చిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. ముందుగా.. రాష్ట్రం ఏర్పడకపోతే బండి, రేవంత్ కు పదవులు వచ్చేవా? అది కేసీఆర్ వల్లేగా అని అన్నారు కేటీఆర్. దీనిపై అదిరిపోయే పంచ్ లు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి.
ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం.. సోనియాగాంధీ పట్టుదలతో, దయతోనే రాష్ట్రం ఏర్పడిందని కేసీఆరే ఒప్పుకున్నారు. మీడియా ముఖంగానే చెప్పారు. మరి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశే ఉంటే కేసీఆర్ ఫ్యామిలీకి పదవులు వచ్చేవా? అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే మంచిదని సూచిస్తున్నారు. ఇక.. త్యాగాలు, పదవుల గురించి మాట్లాడిన కేటీఆర్.. పదవులు ఎడమకాలి చెప్పుతో సమానమని చెప్పారు. దీనిపైనా పంచ్ ల ప్రవాహం కొనసాగుతోంది.
కేసీఆర్ కు పదవుల మీద ఆశ లేకపోతే.. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని ఎందుకు చేయలేదు.. కాపలా కుక్కగా ఉంటానని పదవి ఎందుకు చేపట్టారు? పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పి.. పదవి వస్తుందో లేదో అనే అనుమానంతో రివర్స్ అయింది కేసీఆర్ కాదా? అంతెందుకు.. పదవీ వ్యామోహం లేకపోతే మీ కుటుంబంలో అంతమంది ఎందుకు చేపట్టారు? అని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. దీన్నిబట్టే ఎవరు పదవి కోసం పాకులాడుతున్నారో అర్థం అవుతోందని సెటైర్లు వేస్తున్నారు. పైగా వినోద్, కవిత ఓడిపోతే.. వెంటనే వారిని ఇతర పదవుల్లో కూర్చోబెట్టారని గుర్తు చేస్తున్నారు.
మాటలు చూస్తే కోటల దాటతాయి.. చేతలు మాత్రం గడప దాటవు అన్నట్లుగా కేటీఆర్ కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు విపక్ష నేతలు. రాష్ట్రం సాధించినందుకు జీవితాంతం టీఆర్‌ఎస్ ను గెలిపించాలని అంటారా? ఇదెక్కడి చోద్యం. ఇది ముమ్మాటికీ అహంకారమే.. వితండవాదం.. విచిత్ర వాదనే అని మండిపడుతున్నారు. తెలంగాణ.. ఒక్క కేసీఆర్ వల్లే రాలేదని.. అందరూ పోరాటం సాగించారని గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో కేసీఆర్ చాలా డ్రామాలు చేశారని ఆనాటి విషయాలను వివరిస్తున్నారు ప్రతిపక్ష నేతలు.
తెలంగాణ కోసం కేసీఆర్ చావు నోట్లో తల పెట్టారని చెబుతున్న కేటీఆర్… అమరుల విషయంలో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. వారి కుటుంబాలను ఆదుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. మైక్ ఉంది కదా అని ఏదిపడితే అది మాట్లాడితే ఎదురుదెబ్బలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మళ్లీ సెంటిమెంట్ ను రగిలించి రాజకీయ లబ్ధి పొందాలనేదే కేటీఆర్ ప్లాన్ గా కనిపిస్తోందని అనుమానిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంకో మాట కూడా గుర్తు చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. కేటీఆర్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని అంటున్నారు. దానికి కారణం.. కేసీఆర్ తనను సీఎం చేయడం లేదనే ఇలా ఏదిపడితే అది మాట్లాడుతున్నారని చెబుతున్నారు.