రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయిని.. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు ప్రజారోగ్య సంచాలకులు డీహెచ్ శ్రీనివాసరావు. వడదెబ్బ తగిలిన వారిని చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలని తెలిపారు. వీలైనంత తొందరగా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలిపారు.
రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్స్ ప్రకటించిందని అన్నారు. అంతేకాకుండా ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి, ఖమ్మంతో పాటు హైదరాబాద్‌లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు డీహెచ్.
సన్‌స్ట్రోక్ వల్ల ఎక్కువగా మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యకాలంలో ఇళ్లల్లోనే ఉండటం మంచిదని సూచించారు. అత్యవసరం అయితే.. తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు.
శుక్ర, శనివారాలు ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వచ్చే మూడు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకులు తెలిపారు.