గుజరాత్ లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిన ఘటనకు సంబంధించిన కేసులో ఒరేవా గ్రూప్ డైరెక్టర్ జేసుఖ్ పటేల్ మంగళవారం కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆదేశాలపై పోలీసులు ఆయనను జుడిషియల్ కస్టడీలోకి తీసుకుని జైలుకు తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితునిగాఇతడిని పోలీసులు ఇదివరకే తమ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
పటేల్ కోర్టులో లొంగిపోగా ఆయనను పోలీసులు బయటకు తీసుకు వచ్చి జైలుకు తరలిస్తున్న దృశ్యాలు మీడియా కంటబడ్డాయి. గత ఏడాది అక్టోబరు 30 న ఈ బ్రిడ్జ్ మచ్చు నదిలో కూలిపోయిన ఘటనలో సుమారు 135 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. కేబుల్ బ్రిడ్జ్ మెయింటెనెన్స్, ఇతర నిర్వహణా బాధ్యతలు చూస్తున్న ఒరేవా గ్రూపు తన విధుల్లో నిర్లక్ష్యం వహించిందన్న ఆరోపణలు వచ్చాయి.
గుజరాత్ ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా తన నివేదికలో ఈ సంస్థ నిర్వాకాన్ని వేలెత్తి చూపింది. అజంతా గోడ గడియారాలను ఇతర యాక్సెస్సరీలను తయారు చేసే ఒరేవా గ్రూపునకు ఈ బ్రిడ్జ్ నిర్వహణా బాధ్యతలు అప్పగించడంపై విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.
నాడు ఈ ఘటనకు సంబంధించి 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాను అరెస్టు కాకుండా జేసుఖ్ పటేల్ గత జనవరి 14 న కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు దాన్ని తిరస్కరించింది. అప్పటినుంచి ఆయన పరారీలో ఉన్నాడు. ఇక తన అరెస్టు తప్పదని భావించి కోర్టులో లొంగిపోయాడు.