చనిపోతూ కూడా మరో ఐదుగురి కుటుంబాల్లో వెలుగులు నింపింది ఓ యువతి. తన శరీర భాగాలను దానం చేసి మరో ఐదుగురికి ప్రాణం పోసింది. పూణెలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువతి చేసిన ఆర్గాన్ డొనేషన్ వల్ల కమాండ్ హాస్పిటల్ సదరన్ కమాండ్ లో పని చేస్తున్న ఇద్దరు ఆర్మీ సైనికులతో సహా ఐదుగురి ప్రాణాలను కాపాడడం జరిగింది.
చివరి క్షణాల్లో ఉన్న ఆ యువతిని తీసుకొచ్చిన ఆమె కుటుంబ సభ్యులు.. ఆమె మెదడులో ఎలాంటి జీవమూ లేకపోవడంతో అవయవదానానికి ఒప్పుకున్నారని డిఫెన్స్ పీఆర్వో తెలిపారు. ట్రాన్స్ ప్లాంటేషన్ కు సంబంధించిన అనుమతులన్నీ తీసుకున్న తర్వాత కమాండ్ హాస్పిటల్ (సదరన్ కమాండ్)లోని టీమ్ వెంటనే ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియను చేపట్టింది.
జులై 14 రాత్రి, జులై 15 తెల్లవారుజామున అవయవమార్పిడీని వైద్యులు పూర్తి చేశారు. అలా ఆ మహిళ కిడ్నీలను భారత సైన్యంలోని ఇద్దరు సైనికులకు మార్పిడి చేశారు, సీహెచ్ (ఎస్‌సీ)-సాయుధ దళాల మెడికల్ కాలేజ్ కాంప్లెక్స్ ఐ బ్యాంక్ లో కళ్ళు భద్రపరిచారు. పూణేలోని రూబీ హాల్ క్లినిక్‌లో ఒక రోగికి కాలేయం ఇచ్చారు.
మరణం తర్వాత అవయవ దానం అనేది చాలా కరుణతో కూడిన విషయమని, అవయవదాన కార్యకర్తలు, యువతి తల్లిదండ్రుల సమన్వయంతో చేసిన ప్రయత్నం ఐదుగురు తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు జీవితాన్ని నిలబెట్టిందని, మరొకరికి కంటి చూపును అందించిందని పీఆర్వో తెలిపారు.
‘మరణం తరువాత మీ అవయవాలను స్వర్గానికి తీసుకెళ్లకండి, అక్కడ వాటి అవసరం లేదు.. భూమి మీదే అవి అవసరమని దేవునికి తెలుసు’ అని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలు అవయవ దానం విశిష్టతను, దానిపై విస్తృత అవగాహన కల్పిస్తాయని పీఆర్వో తెలిపారు.