వైసీపీ పార్టీ మైలవరం ఎమ్మెల్యే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి ఆయన అసలు నేను ఎందుకు ఎమ్మెల్యే ను అయ్యానోనని ఓ సమావేశంలో మాట్లాడుతూ వాపోవడం అటు వైసీపీ పార్టీలో.. ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
వైసీపీ పార్టీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి సొంతపార్టీ పైనే విమర్శలు గుప్పించారు. తమ కుటుంబం 55 ఏళ్లుగా రాజకీయాల్లో ఉందని, తాను పుట్టినప్పటి నుంచి తన త్రండి రాజకీయాల్లో ఉన్నారని తెలిపారు ఆయన. అయితే ప్రస్తుతం మాత్రం రాజకీయాలు చాలా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అసలు తాను రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా అన్న విరక్తి వస్తుందన్నారు అందరి ముందే. ఎమ్మెల్యే ఎందుకయ్యానా అని ఒక్కోసారి అనిపిస్తుందని చెప్పారు.
ప్రస్తుత రాజకీయాల్లో రాజకీయ నాయకుడు ఎప్పుడూ తన చుట్టూ ఓ పది మంది పోరంబోకులను వెంటేసుకొని తిరుగుతుండాలి.. అలాంటప్పుడే నాయకుడిగా ముందుకు సాగే అవకాశాలున్నాయని చెప్పారు. అది చేతకకాపోవడం వల్లే తాను పాతతరం నాయకుడిగా మిగిలిపోయాయని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ వా పోయారు. మూడున్నరేళ్ల కాలంలో ఒక్కరిపై అక్రమ కేసులు పెట్టించలేదని, ఈ విషయంలో తనపై తమ పార్టీలోని కొందరు నేతలకు అసంతృప్తి ఉండొచ్చని అన్నారు.
ఎమ్మెల్యే గా ఉండి కూడా సాటి వ్యక్తులకు సాయం చేయలేకపోతున్నానని కృష్ణ ప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. రైతుల అభివృద్ధి కోసం సీఎం జగర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని.. వాటిని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గుంటూరులో ఇటీవల నిర్వహించిన టీడీపీ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై ఆయన స్పందిస్తూ సేవా కార్యక్రమాలను చేసే వారిని విమర్శించడం సరికాదన్నారు. ప్రజలకు సేవ చేయాలనుకునే ఎన్నారైలను ఆపడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. తొక్కిసలాట ఘటనను చిలవలు,పలవలు చేసి చూపడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.