ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్ళ వరకు దీర్ఘకాలిక లీజుకు ఇచ్చి 6 నుంచి 7 వేల కోట్లు సమీకరించాలని హెచ్ఎండీఏ ప్లాన్ వేస్తోంది. అందులో భాగంగా పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఓఆర్ఆర్ టోల్, కార్యకలాపాలను, నిర్వహణను చేపట్టాలని నిర్ణయించింది.
ఈ మేరకు లీజుపై ఒప్పందాన్ని అమలు చేయడానికి హెచ్ జీసీఎల్ బిడ్డర్లను ఆహ్వానించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో లీజు ఒప్పందం ద్వారా దాదాపు 400 కోట్ల ఆదాయం సమకూరింది. కానీ వార్షిక లీజును అమలు చేయడంలో సంస్థకు కొన్ని సవాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. హెచ్ జీసీఎల్ వచ్చే ఏడాది కాంట్రాక్ట్ కోసం ప్రతి సంవత్సరం ముందుగానే ప్రైవేట్ ఏజెన్సీల నుంచి బిడ్ లను ఆహ్వానించవలసి ఉంటుంది.
ఇలా బిడ్డర్ లను ఖరారు చేయడంలో చాలా సమయం తీసుకుంటుండడంతో హెచ్ ఎండీఏ ప్లాన్ కు ఛాలెంజింగ్ గా మారింది. కాంట్రాక్ట్ వ్యవధి మార్చిలో ముగిసిపోతే కనీసం 90 రోజుల ముందుగానే అంటే డిసెంబర్ నుండి బిడ్ లను ఆహ్వానించాలి. ఇది కాకుండా కాంట్రాక్టును పొడిగించాలంటూ వివిధ కారణాలను చూపుతూ కొన్ని ఏజెన్సీలు కోర్టును ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇక ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి హెచ్ జీసీఎల్ ఇప్పుడు లీజు వ్యవధిని 30 ఏళ్ళ లీజు కాలానికి ఆమోదం తెలిపింది. ఇది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారమే జరుగుతోందని ఓ అధికారి తెలిపారు.