వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్త దాడిలో తీవ్రంగా గాయపడిన పశ్చిమ నియోజక వర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తోట పవన్ ను పరామర్శించారు టీపీసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రే. పవన్ కు మనోధైర్యాన్ని ఇచ్చామని ఆయన అన్నారు. ప్రజా వ్యతిరేకతను అణగదొక్కి ఎక్కువ రోజులు పాలన సాగించలేరని ఆయన మండిపడ్డారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష పార్టీలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దాడులకు భయపడేది లేదన్నారు ఆయన. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.
కాంగ్రెస్ లోని ప్రతీ ఒక్క కార్యకర్తకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల దాడులు మరీ మితిమీరుతున్నాయన్నారు. ముఖ్యంగా ఇటీవల కోదాడలో వాల్యా నాయక్ అనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్త ఛాతిలో కాలుతో తొక్కి చంపే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ తమ అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో అన్ని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల పై, నాయకులపై భౌతిక దాడులు రోజురోజుకూ ఎక్కువ చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి జనసభ మీటింగ్ ప్రజాదరణ చూసి.. ఏదో ఒక గలాటా చేసి ప్రజల దృష్టిని మరల్చడానికి చేసిన ప్రయత్నమే పవన్ పై దాడి అని మాణిక్ రావు ఠాక్రే ఫైర్ అయ్యారు.