యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆశగా ఒక్కసారైనా అందుకోవాలని చూసే అవార్డు ఆస్కార్. 90 ఏళ్లకు పైగా ఈ ఆస్కార్ అవార్డులను అందజేస్తున్నారు. ఈ ఆస్కార్ అవార్డుల వేడుక ఆదివారం (మార్చి 12) సాయంత్రం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది.
ఈ సారి ఈ వేడుకలు భారతదేశానికి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈసారి ఆస్కార్ రేసులో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కూడా చేరింది.దీనితో పాటు 62 ఏళ్లలో తొలిసారిగా మరో మార్పు కూడా రానుంది.అవార్డ్ షో ఏదైనా రెడ్ కార్పెట్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది.
ఈ రెడ్ కార్పెట్ పై తారలు తమ గ్లామర్ ను చాటుకుంటారు. అయితే 62 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆస్కార్ అవార్డు వేడుకలకు రెడ్ కార్పెట్ పరుచుకోవడం లేదు. ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద నడవాలనేది ప్రతి స్టార్ కల, కానీ ఈసారి రెడ్ కార్పెట్ రంగు మారనుంది.
1961 నుంచి అంటే 33వ అకాడమీ అవార్డుల వేడుక నుంచి ప్రతిసారీ రెడ్ కార్పెట్ అలంకరిస్తారు. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయాన్ని మార్చాలని నిర్ణయించారు. ఆస్కార్ వేడుకలను నిర్వహిస్తున్న అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఈ సారి ఎరుపు రంగుకు బదులు షాంపైన్ రంగును ఎంచుకుంది.