ఉస్మానియా ఆసుపత్రి జూనియర్ డాక్టర్ల ఆందోళన నాలుగో రోజు మరింత తీవ్రం అయ్యింది. నాలుగు నెలలుగా కరోనా పేరుతో ఇతర ఆపరేషన్లు అన్నీ నిలిపేశారని, ఆపరరేషన్ థియేటర్లు ఓపెన్ చేయాలంటూ జూడాలు డిమాండ్ చేస్తున్నారు.
ఆపరేషన్లు లేక పేదలు ఇబ్బందిపడుతున్నారని, నాలుగు నెలల నుండి సర్జరీలు లేకపోతే తమ చదువులు కూడా సాగవని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. కరోనా పేరుతో దాదాపు 10ఇతర డిపార్ట్మెంట్లను పట్టించుకోవటం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి సూపరిండెంట్ చాంబర్ ను ముట్టడించేందుకు జూడాలు ప్రయత్నించటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని, అవసరం అయితే రాష్ట్ర వ్యాప్తంగా జూడాలంతా కలిసి సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.