ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయంటూ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది విద్యార్ధులు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించారు. రాష్ట్రం సాధించి ఆరేళ్లయినా బంగారు తెలంగాణలో కూడా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఓ విద్యార్ది ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆత్మహత్యలకు తావుండదని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు నాడే ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నరసయ్య ప్రాణాలు తీసుకున్నాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందన కొంపెల్లి నర్సయ్య ఉస్మానియా యూనివర్సిటీలో జాగ్రఫీ సబ్జెక్ట్ లో పీజీ చదివాడు. ఆ తర్వాత అక్కడే పి.హెచ్.డి కూడా పూర్తి చేశాడు. ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో ఉన్నాడు. కానీ రాష్ట్రం సిద్దించి ఆరేళ్లయినా యూనివర్సిటీ పోస్టులు భర్తీ చేయకపోవడం…వయసు మీద పడి బతుకు భారం కావడం..ఇంటి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో గత కొంత కాలంగా తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. దీంతో న్యూ పీజీ హాస్టల్ లోని రూమ్ నెంబర్ 3 లో సోమవారం ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.
నర్సయ్య ఆత్మహత్య వార్త యూనివర్సిటీలో కలలకం రేపింది. యూనివర్సిటీలోని విద్యార్ధులందరూ న్యూ పీజీ హాస్టల్ కు చేరుకున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు హడావుడిగా మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించడానికి ప్రయత్నించారు. విద్యార్ధులు పోలీస్ వ్యాన్ కు అడ్డంగా కూర్చొని మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, స్టూడెంట్స్ మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. అనంతరం పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి మృతదేహాన్ని గాంధీ హాస్పటల్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు చనగాని దయాకర్, ఓరుగంటి కృష్ణ, శ్రీహరి, అంజి, ప్రవీణ్ రెడ్డితో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసి రెండు గంటల పాటు పోలీసు వాహనంలో హైదరాబాద్ చుట్టూ తిప్పారు. అనంతరం కాంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు.
ఆత్మహత్య చేసుకున్న నర్సయ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని ఉస్మానియా జేఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించింది.