హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని స్టూడెంట్స్ రోడ్డెక్కారు. రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు. యూనివర్సిటీలోని హాస్టళ్లకు విద్యుత్, నీటి సరఫరాను పునరుద్దరించాలంటూ మంగళవారం విద్యార్థులు లేడీస్ హాస్టల్ ముందు రోడ్డుపై బేఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ వారి ఆవేదనను తెలిపారు.
గ్రూప్-1 పరీక్ష వారం రోజులు ఉండగా ఇలా విద్యుత్, నీటి సరఫరా నిలిపివేయడం వలన తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనడం బాధాకరమన్నారు. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ వైఖరితో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని మండి పడ్డారు. నియంత పాలనతో తమ జీవితాలను ఆగం చేసే పనిలో వీసీ ఉన్నాడని ఓయూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
నోటిఫికేషన్ కోసం ఇన్ని రోజులు ఎదురు చూశాం. తీరా నోటిఫికేషన్ వచ్చిన నుండి పరీక్షకు సన్నద్ధమవుతున్నప్పుడు ఇలా కరెంట్, వాటర్ సరఫరాను నిలిపివేసి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోయారు. యూనివర్సిటీ చరిత్రలోనే ఇలాంటి ఏ వీసీని మేము చూడలేదన్నారు విద్యార్థులు.
ఓయూలో సమస్యలను పరిష్కరించాల్సిన వీసీనే.. ఇప్పుడు పెద్ద సమస్యగా తయారయ్యాడన్నారు. ఒక పక్క అధ్యాపకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులపై కక్ష గట్టి వారిని ఇబ్బంది పెట్టిన వీసీ చల్లని చూపు.. ఇప్పుడు మాపై పడిందని సెటైర్లు వేశారు స్టూడెంట్స్. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు విద్యుత్, నీటి సరఫరా వెంటనే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే అప్పటి వరకూ తమ నిరసనను కొనసాగిస్తామని.. రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు ఓయూ విద్యార్థులు.