ఉస్మానియా యూనివర్సిటీ నుంచి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు. శుక్రవారం జరిగే 82వ స్నాతకోత్సవంలో దీనిని ప్రదానం చేయనున్నారు. 21 సంవత్సరాల తర్వాత ఓయూ డాక్టరేట్ ను ప్రదానం చేస్తోంది. చివరిగా బెల్ లాబొరేటరీస్ మాజీ అధ్యక్షుడు అరుణ్ నేత్రావలికి ఈ గౌరవం దక్కింది. ఇప్పుడు ఎన్వీ రమణ అందుకోనున్నారు. 1917 నుండి ఇప్పటివరకు ఓయూ 47 మందికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది.
దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా గతేడాది ఏప్రిల్ 24 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఎన్వీ రమణ. ఈనెల 26 వరకు ఆయన సీజేఐ హోదాలో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉస్మానియా ఆయనకు డాక్టరేట్ ను ప్రదానం చేస్తోంది. యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.
మరోవైపు సుప్రీంకోర్టు తర్వాతి ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా కోరుతూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి ఎన్వీ రమణను కోరింది. పదవీ విరమణ చేసే సీజేఐ తన వారసునిగా సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి పేరును సూచించడం సంప్రదాయంగా వస్తోంది. సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో రమణ తర్వాత న్యాయమూర్తి ఉదయ్ ఉమేశ్ లలిత్ ఉన్నారు.
ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నారు ఎన్వీ రమణ. అయితే.. జస్టిస్ లలిత్ సీజేఐగా నియమితులైతే ఆయన పదవీ కాలం మూడు నెలల్లోపే ముగుస్తుంది. నవంబర్ 8న ఆయన పదవీ విరమణ చేస్తారు.