ఈ వీకెండ్ రిలీజైన సినిమాల్లో ఏది హిట్టయిందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. థియేటర్లలో డీజే టిల్లు మెప్పిస్తే, ఓటీటీలో సుమంత్ నటించిన మళ్లీ మొదలైంది సినిమా ఫర్వాలేదనిపించుకుంది. చాలా పోటీ మధ్య వచ్చి హిట్ టాక్ అందుకున్నాయి ఈ రెండు సినిమాలు.
ఓటీటీలో వచ్చిన ఓ సినిమా హిట్టవ్వడం అంటే మామూలు విషయం కాదు. సముద్రమంత స్టఫ్ ఉంటుంది అందులో. పైగా అదే రోజు మరికొన్ని పెద్ద సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు వచ్చాయి. అమెజాన్ లో మహాన్ వచ్చింది. ఆహాలో భామాకలాపం వచ్చింది. ఈ రెండు సినిమాల నుంచి ఎదురైన పోటీని తట్టుకొని మరీ విజేతగా నిలిచింది సుమంత్ నటించిన సినిమా.
ఇక థియేటర్లలో చూసుకుంటే ఇంతకంటే పెద్ద పోటీ ఉంది టిల్లూకి. రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చింది. భారీ సంఖ్యలో థియేటర్లు కూడా దానికే దొరికాయి. అది రిలీజైన 24 గంటల తర్వాత టిల్లూ వచ్చింది. అయితే వస్తూనే సంచలనం సృష్టించింది. ఏకంగా ఖిలాడీని మరిచిపోయేలా చేసింది.
ఖిలాడీలో రవితేజ వన్ మేన్ షో నడిచినట్టుగానే, డీజే టిల్లూలో కూడా సిద్ధు జొన్నలగడ్డ వన్ మేన్ షో నడిచింది. కాకపోతే ఈసారి రవితేజ కంటే సిద్ధూనే ఎక్కువమంది ఆడియన్స్ ఇష్టపడ్డారు. అలా వెండితెరపై సిద్ధు, ఓటీటీ తెరపై సుమంత్ ఈ వీకెండ్ ఎట్రాక్షన్స్ గా నిలిచారు.