సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఢిల్లీలో ఓయూ పూర్వ విద్యార్థి, టీర్ఎస్‌వీ నాయకురాలు, ఉద్యమకారిణి దాత్రికా స్వప్న పడికాపులు కాస్తున్నారు. గతంలో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసేందుకు ఆమె చాలా సార్లు ప్రయత్నించారు.
కానీ ఆమెకు సీఎం అపాయింట్ మెంట్ దొరకలేదు. ఈ క్రమంలో ఆయన ఢిల్లీకి వెళ్లారనే సమాచారం తెలుసుకుని ఆమె కూడా ఢిల్లీకి చేరుకున్నారు. గత రెండు రోజులుగా కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం ఢిల్లీలోని సీఎం కేసీఆర్ కార్యాలయం ముందు ఆమె ఎదురు చూస్తోంది.
ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యమకారులకు చాలా అన్యాయం జరిగిందని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారిణిగా తనకు మంచి పేరుందని ఆమె పేర్కొన్నారు. విశిష్ట ఉద్యమకారిణిగా గుర్తించి తనకు కేసీఆర్ అవార్డు కూడా ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.
తనకు టీఆర్ఎస్ పార్టీలో అవకాశం కల్పిస్తానని సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారని అన్నారు. ఆ మాట నిలబెట్టుకోవాలని సీఎం కేసీఆర్ ను కోరేందుకే ఢిల్లీకి వచ్చానన్నారు. కేసీఆర్ ను కలిసేందుకు ఢిల్లీకి వస్తే ఆయన్ని సెక్యూరిటీ సిబ్బంది బూతులు తిడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.