హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తకరమైన వాతావరణం నెలకొంది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు. మంత్రి తలసానిపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులుకు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం విద్యార్థులు ఇంద్ర పార్క్ కి ర్యాలీగా బయలు దేరారు. రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని.. లేదంటే దున్నపోతులతో, గొర్రె పొట్టేలుతో గాంధీ భవన్ ను ముట్టడిస్తామని గొల్ల కురుమల పోరాట సమితి హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో రేవంత్ కి మద్దతుగా టీ కాంగ్రెస్ నేతలు రియాక్ట్ అవుతున్నారు. రేవంత్ యాదవులను కించపరచలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారే తప్ప.. యాదవుల గురించి ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు.
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి మాట్లాడుతూ.. గాంధీ భవన్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రియాంక గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ పార్టీ నేతలు భయపడుతున్నారని మండిపడుతున్నారు. అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు మల్లు రవి.
తల పొగరుతో తలసాని చేసిన వ్యాఖ్యలకు రేవంత్ సమాధానం ఇచ్చారని అన్నారు. ఈ మాటలకు యాదవులకు అంటగట్టి కుల రాజకీయాలకు తెరలేపారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు.