టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి, కమిషన్ చైర్మన్ ను వెంటనే భర్తరఫ్ చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు ఓయూ విద్యార్థులు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీఎస్పీఎస్సీ పూర్తిగా విఫలం అయిందన్నారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీ ఘటనలు వరుసగా జరగడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థులు.
నిరుద్యోగ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన టీఎస్పీఎస్సీ చైర్మన్ ను వెంటనే అరెస్ట్ చేసి, వెంటనే విధుల నుంచి తప్పించాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వ హస్తం ఉందంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
బోర్డు చైర్మన్ కి, సెక్రటరీకి తెలియకుండా పాస్ వర్డ్ లు బయటకు ఎలా లీక్ అయ్యాయని స్టూడెంట్స్ ప్రశ్నించారు. అంగట్లో సరుకులు అమ్ముకున్నట్లు టీఎస్పీఎస్సీ పేపర్లు అమ్ముతున్నారని మండిపడ్డారు. ఒక ఏఈ పేపరే కాదు.. అన్ని పేపర్లు లీక్ అయి ఉంటాయని విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. గ్రూప్-1 కూడా లీక్ అయ్యి ఉంటుందన్నారు ఓయూ స్టూడెంట్స్.