ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఓయూ విద్యార్థులు సమరశంఖం పూరించారు. సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల్ని వర్సిటీలో అడ్డుకుని తీరతామని సవాల్ చేశారు. ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు విద్యార్థులు. కేసీఆర్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టారు. అయితే.. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
ఈ నెలాఖరులోగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు సురేష్ యాదవ్. లేదంటే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ జన్మదినాన్ని బ్లాక్ డేగా పాటించాలని నిరుద్యోగ విద్యార్థులకు పిలుపునిచ్చారు. అన్ని వర్సిటీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ తగులబెడతామని తెలిపారు.
రాష్ట్రంలో అధోగతి పాలన కొనసాగుతోందని అన్నారు సురేష్ యాదవ్. తన కుమార్తె కవితకు ఏం పదవి లేదు.. కేటీఆర్ కు రాఖీ కట్టనని చెబితే మూడు నెలల్లో కేసీఆర్ ఎమ్మెల్సీని చేశారని ఆరోపించారు. నిరుద్యోగులు ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలని ప్రశ్నించారు. అన్ని పార్టీల నాయకులను కలుపుకుని పోరాటానికి సిద్ధమౌతామని తెలిపారు. అయినా.. ఏ ముఖం పెట్టుకుని ఓయూలో బర్త్ డే సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు.
కేసీఆర్ ఏడేళ్ల పాలనలో తెలంగాణ 60 ఏళ్లు వెనక్కి పోయిందని అన్నారు సురేష్. నిరుద్యోగులు పండుగలకు కూడా ఇళ్లకు వెళ్లలేని పరిస్థితిని తీసుకొచ్చారని.. యూనివర్సిటీకి సంతోష్ రావాలని చూస్తున్నారని.. ఇక్కడి భూములపై కన్నుపడిందా? అని ప్రశ్నించారు. దేశంలో కేసీఆర్ లాంటి విచిత్రమైన సీఎంను ఎక్కడా చూడలేదని అన్నారు. ఉద్యోగాల కోసం వేసిన కమిటీలు.. కాలయాపన కమిటీలేనని తేల్చేశారు.
ఫిబ్రవరి 17ను తెలంగాణ నిరుద్యోగ విద్రోహ దినంగా పాటిస్తున్నట్లు తెలిపారు సురేష్ యాదవ్. ప్రశాంతంగా ఉన్న యూనివర్సిటీని నాశనం చేయాలని చూస్తున్నారని.. కేసీఆర్ బర్త్ డేని అడ్డుకుని తీరతామని స్పష్టం చేశారు.