– కమిషన్స్ కక్కుర్తే కాదు.. ఓనర్ షిప్ లో పార్టనర్ షిప్
– రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి ఏడాది రూ.1.68 కోట్లే..
– ఎన్నికల నాటికి రూ.113 కోట్లకి చేరిన ఔట్ డోర్ ప్రచారం
– తెలంగాణ ఏజెన్సీలకు పంగనామం.. ఆంధ్రా కంపెనీలకు అందలం
– 68 జీవో గాలికొదిలేసి దందాలు
– ప్రభుత్వాన్ని అడగాలని కమిషనర్ నిర్లక్ష్యపు సమాధానాలు
– తొలివెలుగు క్రైంబ్యూరో చేతిలో పక్కా అధారాలు
క్రైంబ్యూరో, తొలివెలుగు:విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రచారం పీక్స్ లో ఉంటుందని అంటారు. ఈ విషయంలో టీఆర్ఎస్ రెండడుగులు ముందే ఉంది. నగరంలో నిత్యం ఏదో ఒక రూపంలో ప్రభుత్వం చేస్తున్న పనులను, సంబరాలను, ఉత్సవాలను ప్రచారాస్త్రంగా ఔట్ డోర్ మీడియాను తెగ వాడేస్తోంది. గతంలో హోర్డింగ్ లు ఉంటే సుమారు 200 కంపెనీలు వాటిపై వ్యాపారం చేసుకునేవి. వేల మందికి ఆదాయమార్గంగా ఉండేది. మెట్రో పిల్లర్స్ యాడ్స్ కోసమో లేదా ఆంధ్రా ఏజెన్సీల గుత్తాధిపత్యానికో మీడియాను తమ చేతుల్లోకి తీసేసుకున్నారు. ఎన్నిసార్లు ధర్నా చేసినా.. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వారు లేరు. హైకోర్టులో సరైన సమాధానం చెప్పకుండానే దందాలు కొనసాగిస్తున్నారు. జీహెచ్ఎంసీకి రూ.50 కోట్ల మేర నష్టం వచ్చినా ఎవ్వరికీ పట్టడం లేదు. ఆంధ్రా ఆడ్వటైజింగ్ ఏజెన్సీలను పెంచిపోషిస్తోంది మంత్రి కేటీఆరేనని ఆరోపణలు వస్తున్నాయి.
ఔట్ డోర్ మీడియా ప్రచార జోరులో తగ్గేదేలే?
ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియోతో పాటు పలు సామాజిక మాధ్యమాలు కాకుండానే కేవలం ఔట్ డోర్ మీడియా ద్వారానే ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రకటనలు ఇస్తోంది. ఎన్నికలు ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మంత్రులు, అధికారులకు 40 శాతం కమీషన్ కొట్టి ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ నుంచి ఆంధ్రా ఏజెన్సీలు ప్రకటనలు తెచ్చుకుంటున్నాయి.
2014-15 ఆర్థిక సంవత్సరంలో 27 ఈవెంట్స్ ద్వారా 14 ఆడ్వటైజింగ్ ఏజెన్సీలకు లబ్ది జరిగింది. దాని ఖర్చు రూ.17 కోట్లు.
2015-16కి రూ.27 కోట్లు ఖర్చు చేశారు. 32 ఏజెన్సీలకు 91 సార్లు ప్రకటనలు ఇచ్చారు.
2016-17కి రూ.44 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. 167 సార్లు 29 ఏజెన్సీలకే కట్టబెట్టారు.
2017-18 సంవత్సరానికి రూ.74 కోట్లు ప్రచారానికి ఖర్చు చేస్తే.. 239 సార్లు ఇచ్చారు. ఇందులో 18 ఏజెన్సీల పైనే ప్రేమ కురిపించారు.
2018-19కి గాను రూ.113 కోట్లను ఎలక్షన్ స్ట్రాటజీలో పెట్టేశారు. 209 సార్లు భారీగా ప్రకటనలకు పిలిచారు. ఇందులో అన్ని జిల్లాలను కలుపుకొని 65 ఏజెన్సీలకు ఇచ్చారు. అంటే ఎలక్షన్స్ ఉంటేనే అన్ని ఏజెన్సీలు గుర్తుకొచ్చాయని పలు సంస్థలు ఆరోపిస్తున్నాయి.
2019-20కి 29 సార్లు ప్రకటనలు ఇచ్చారు. 13 ఏజెన్సీలకే కట్టబెట్టారు.
2020-21 ఏడాది 35 సార్లు ప్రభుత్వ ప్రకటనలు పిలిచి.. 14 ఏజెన్సీలనే ఎంచుకున్నారు.
నిబంధనలు గాలికి!
జీవో 68ని అమలు చేస్తున్న ప్రభుత్వం.. అడ్వటైజింగ్ మాఫియాని పట్టించుకోవడం లేదు. మెట్రో పోర్టల్ 15 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జీల వద్ద ఎత్తుపైనా దృష్టి పెట్టడం లేదు. ఒక్క ఫీట్ అక్రమంగా హోర్డింగ్ ఉన్నా రోజుకు లక్ష రూపాయల ఫైన్ వేయాల్సి ఉందని జీవోలో ఉంది. కానీ.. ఎక్కడ అది అమలు కావడం లేదు. మాముళ్ల మత్తులో అధికారులు ఆంధ్రా ఏజెన్సీల దందాను అడ్డుకోవడం లేదు. ఇలా హైదరాబాద్ లో 150 స్పాట్స్ ఉన్నాయంటే నెలకి కోటి రూపాయల దందా కేవలం ఈ జీవో ఉల్లంఘనతోనే జరుగుతోంది.
ఆంధ్రా ఏజెన్సీల కబ్జా తీరు ఇదే!
లీడ్ స్పేస్.. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐ అండ్ పీఆర్ లో కనీసం రిజిస్టర్ కూడా చేసుకోలేదు. కానీ.. ఇప్పుడు ఆర్ఎల్ కన్ స్ట్రక్షన్ అనే కంపెనీని బినామీగా పెట్టుకుని 60 శాతం మార్కెట్ ని కోట్టేసింది. అత్యధిక కార్డు రేట్ కూడా వీరికే. ఫ్లెక్సీ ప్రింటింగ్ చేసే కళ్యాణ్ డిజిటల్ పై కూడా యాడ్స్ తీసుకొస్తున్నారంటే వీరి పవరేంటో తెలిసిపోతుంది. ఆర్ఎల్ కన్ స్ట్రక్షన్ జీహెచ్ఎంసీలో బాషా అనే ఎస్టేట్ ఆఫీసర్ అండదండలతో ఇదంతా సాగిస్తోంది. ఇక ప్రకాశ్ యాడ్స్ గతంలో 25 శాతం మార్కెట్ ఉంటే ఇప్పుడు 30 శాతానికి పెరిగింది. అలాగే శ్రీయాడ్స్ కి భారీగానే ఐ అండ్ పీఆర్ నుంచి లబ్ది జరుగుతోంది. ఇలా వలయం క్రియేషన్స్, ఆర్ఎం అసోసియేట్స్, యూనియాడ్స్, క్రైసెస్ మెనేజ్మెంట్, శ్రీ వెంకటేశ్వర ఔట్ డోర్, అనిల్ పబ్లిసిటీస్, అజయ్ అడ్వటైజింగ్, ఇలా సుమారు 20 టాప్ ఏజెన్సీలు ఆంధ్రా వారివే. ప్రస్తుతం 7 ఏజెన్సీలే తెలంగాణవి ఉన్నాయి. వారికి ఐ అండ్ పీఆర్ 10 శాతం బిజినెస్ కూడా ఇవ్వడం లేదు. అక్రమాలపై కమిషనర్ లోకేశ్ కుమార్ ని ప్రశ్నిస్తే.. ప్రభుత్వానికి తెలుసు తమని ఏది అడగవద్దని సెలవిచ్చారు. ఒక బాధ్యత గల కమిషనర్, ఐఏఎస్.. ప్రభుత్వం అంతా చూసుకుంటుందని మాట్లాడటం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.