ఓ మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న వంద మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారిలో పలువురి పరిస్థితి సీరియస్‌గా వున్నట్టు తెలుస్తోంది. ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే… కుల్తాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పఖిరలయ గ్రామంలో మసీదులో ముస్లింలు రంజాన్ ప్రార్థనలు చేశారు. అనంతరం వారు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం వారు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై వైద్యులు మాట్లాడుతూ…
రాత్రి కొందరు కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారని చెప్పారు. ఫుడ్ పాయిజన్ కావడంతో వారికి అలా జరిగిందని గుర్తించామన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న తర్వాత ఫుడ్ పాయిజన్ కావడంతోనే వారు అస్వస్ధతకు గురయ్యారని తెలిసినట్టు డాక్టర్ హరిసూధన్ మొండల్ వెల్లడించారు.
పవిత్ర రంజాన్ మాసం మొదట రోజు ఇలాంటి విషాధ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల సంఖ్య పెరుగుతుండటం కలవర పెడుతోంది. ఈ ఘటనపై ఓ వ్యక్తి భార్య నరేంద్రపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.