దేశంలో దొంగనోట్ల చలామణి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దొంగ నోట్లతో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆర్బీఐ తన నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. నివేదికలోని వివరాల ప్రకారం….
ఇటీవల రూ. 500ల నకిలీ నోట్ల ముద్రణ గణనీయంగా పెరిగినట్టు ఆర్బీఐ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ నోట్ల సంఖ్య 101.9 శాతం పెరిగింది. రూ. 2,000 నకిలీ నోట్ల ముద్రణలో 54.16 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.
విలువ పరంగా మార్చి 31, 2022 నాటికి రూ. 500, రూ. 2000 బ్యాంకు నోట్ల వాటా చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువలో 87.1శాతం వాటాను కలిగి ఉంది. మార్చి 31, 2021 నాటికి 85.7శాతంగా ఉంది.
పరిమాణం పరంగా చూస్తే మార్చి 31,2022 నాటికి 34.9శాతంతో నకలినోట్లలో రూ. 500 నోట్లు అత్యధికంగా ఉన్నాయి. ఆ తర్వాత 21.3శాతంతో రూ.10 డినామినేషన్ బ్యాంక్ నోట్లు ఉన్నాయి.
గతేడాది మార్చి చివరి నాటికి రూ.500 డినామినేషన్ నోట్లు 31.1 శాతం, మార్చి 2020 నాటికి 25.4 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
విలువ పరంగా చూస్తే ఈ నోట్లు మార్చి 2020లో 60.8 శాతం ఉండగా, మార్చి 2022 వరకు 73.3 శాతానికి చేరుకుంది. ఆశ్చర్యకరంగా అదే సమయంలో చలామణిలో రూ.2000 నోట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
రూ.2000 డినామినేషన్ కలిగిన బ్యాంకు నోట్ల సంఖ్య 2022 మార్చి చివరి నాటికి 214 కోట్లుగా ఉంది. చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో ఇది 1.6 శాతంగా ఉంది. 2020 మార్చి చివరి నాటికి, సర్క్యూలేషన్ లో ఉన్న రూ .2000 డినామినేషన్ నోట్ల సంఖ్య 274 కోట్లుగా ఉండేది.