శ్రీలంక అధ్యక్ష, ప్రధాని నివాస భవనాల్లొని అద్బుతమైన పురాతన కళాఖండాలు మాయమయ్యాయి. ఇటీవల రాజధాని కొలంబోలోని అధ్యక్ష భవనం, అధ్యక్ష కార్యాలయంతో పాటు ప్రధాని నివాస భవనాలను ఆందోళన కారులు ఇటీవల తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఆ భవనాల్లో ఆందోళనకారులు సుమారు వారం రోజుల పాటు ఉన్నారు. ఈ క్రమంలో ఆ భవనాల్లోని విలువైన కళాఖండాలను ఆందోళనకారులు తీసుకు వెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ రెండు భవనాల్లో సుమారు వెయికి పైగా విలువైన కళాఖండాలు అదృశ్యమైనట్టు పోలీసులు పేర్కొన్నారు.
అదృశ్యమైన కళాఖండాలకు సంబంధించిన రికార్డులు పురావస్తు శాఖ వద్ద లేకపోవడం పోలీసులకు సమస్యగా మారింది. అసలు ఎన్ని కళాఖండాలు మాయమయ్యాయనే అంశంపై సరైన సమాచారం లేకపోవడం ఇబ్బందిగా పరిణమిస్తోందని అధికారులు చెబుతున్నారు.
అధ్యక్ష, ప్రధాన మంత్రి భవనాల్లోకి ఆందోళనకారులు చొచ్చుకు వెళ్లడంపై నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భవనాలను నిరసనకారులు అదుపులోకి తీసుకోవడాన్ని తాను సమర్థించబోనన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను ఆదేశించినట్టు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు, సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు.