పెను ఉపద్రవానికి టర్కీ, సిరియా దేశాలు కకావికలమయ్యాయి. భూకంప ధాటికి శిథిల దేశాలుగా మారాయి. సోమవారం మొదట టర్కీని వణికించిన భూకంపం తరువాత సిరియాను కూడా టార్గెట్ చేసుకుంది. రిక్టర్ స్కే లుపై 7.8 మ్యాగ్నిట్యూడ్ తో సంభవించిన భూకంపంలో టర్కీ, సిరియాలో మొత్తం 1300 మందికి పైగా పైగా దుర్మరణం చెందారు. చూస్తుండగానేవందలాది భారీ భవనాలు, కట్టడాలు, ఇళ్ళు పేకమేడల్లా కూలిపోయాయి.
మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని భయపడుతున్నారు. శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నారు. తమ దేశంలో సంభవించిన ఈ ఉపద్రవం పట్ల టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటించారు. ఈ ప్రకృతి వైపరీత్యంలో గాయపడినవారిని రక్షించేందుకు హుటాహుటిన సహాయక బృందాలను పంపుతున్నామన్నారు.
తమ దేశ చరిత్రలో ఇంత పెద్ద ఉపద్రవాన్ని చూడలేదని ఆయన అన్నారు. దేశంలో సుమారు పది నగరాలు భూకంపానికి గురయ్యాయి. ఎక్కడికక్కడ భవనాలు, ఇళ్ళు కూలిపోతున్న దృశ్యాల తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంప ప్రభావంతో లెబనాన్, ఈజిప్టు, లెబనాన్, ఇరాక్ దేశాలు సైతం వణికిపోయాయి.
టర్కీ, సిరియా దేశాల్లో భూకంప బాధితులకు అప్పుడే అమెరికా, రష్యా, వంటి దేశాలు యుద్ధ ప్రాతిపదికన సాయాన్నిపంపుతున్నాయి. ఇండియా నుంచి డాగ్ స్క్వాడ్ బృందాలతో బాటు చెరో వందమంది సిబ్బందితో కూడిన రెండు ఎన్డీ ఆర్ ఎఫ్ బృందాలు టర్కీకి బయలుదేరనున్నాయి. టర్కీ భూకంపం పట్ల ప్రధాని మోడీ తీవ్ర సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. తమ దేశం నుంచి అత్యవసరంగా మరిన్ని సహాయక బృందాలను పంపుతామని, అవసరమైన ఇతర సాయాన్ని చేస్తామని ఆయన పేర్కొన్నారు.