గత పదేండ్లలో అసురక్షిత సంభోగం కారణంగా దేశంలో 17 లక్షల మందికి పైగా హెచ్‌ఐవి బారినపడినట్టు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఏయిడ్స్ కేసులకు సంబంధించి మధ్య ప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన ప్రశ్నకు సంస్థ ఈ మేరకు బదులిచ్చింది.
సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం…. ఈ దశాబ్ద కాలంలో హెచ్‌ఐవీ బారిన పడిన వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 2011-12లో 2.4 లక్షల మందికి హెచ్‌ఐవీ సోకింది. 2020-21 నాటికి ఆ సంఖ్య 85,268కి తగ్గింది. గత పదేండ్లలో (2011-2021 మధ్య) మొత్తం 17,08,777 మందికి హెచ్ఐవీ పాజిటివ్ గా తేలింది.
రాష్ట్రాల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 3,18,814 హెచ్‌ఐవీకేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 2,84,577, కర్ణాటకలో 2,12,982, తమిళనాడులో 1,16,536, ఉత్తరప్రదేశ్‌లో 1,10,911, గుజరాత్‌లో 87,440 కేసులు నమోదయ్యాయి.
అలాగే, 2011-12 నుండి 2020-21 వరకు రక్తం, రక్తం ఉత్పత్తుల ద్వారా 15,782 మంది హెచ్‌ఐవీ బారిన పడ్డారు. 18 నెలల యాంటీబాడీ పరీక్ష డేటా ప్రకారం 4,423 మందిలో తల్లి నుండి బిడ్డకు వ్యాపించింది. 2020 నాటికి, దేశంలో 81,430 మంది పిల్లలు, 23,18,737 మంది పెద్దలు హెచ్‌ఐవీతో నివసిస్తున్నారు.