ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్- సుక్మా జిల్లాసరిహద్దులు కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి. భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య భీకరపోరు కొనసాగుతోంది. ఎదురుకాల్పుల్లో ఇప్పటిదాకా 24 మంది జవాన్లు మృతిచెందినట్లుగా తెలిసింది. మరో 13 మంది జవాన్లకు తీవ్ర గాయాలు కాగా, 43 మంది స్వల్ప గాయాలతో బయటపడినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతుండటంతో గంభీర వాతావరణం నెలకొంది.
ఈ ఆపరేషన్‌లో 2 వేల మంది జవాన్లు పాల్గొనగా.. దాదాపు వెయ్యి మందితో కూడిన మావోయిస్టు గెరిల్లా సైన్యం జవాన్లపై మెరుపు దాడికి దిగినట్టుగా ఉన్నతాధికారులు చెప్తున్నారు. మోటార్ లాంచర్‌లను కూడా మావోలు ప్రయోగించారని అంటున్నారు. చనిపోయిన జవాన్లేగాక.. మరికొందరు అచూకీ లేకుండాపోయారు. దీంతో వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. గాయపడిన జవాన్లకు ప్రస్తుతం బీజాపూర్, రాయ్‌పూర్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. జవాన్ల అసువులుబాయడం ఎంతో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరులైన జవాన్లకు నివాళి అర్పించారు.
#WATCH | On ground visuals from the site of Naxal attack at Sukma-Bijapur border in Chhattisgarh; 22 security personnel have lost their lives in the attack pic.twitter.com/nulO8I2GKn
— ANI (@ANI) April 4, 2021