అసోంలో బాల్య వివాహాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. బాల్య వివాహాలు చేసుకున్న వారిని అరెస్టు చేస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇప్పటికే హెచ్చరించారు. ఈ క్రమంలో శనివారం వరకు రాష్ట్రంలో 2,250 మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ 2026 ఎన్నికల వరకు కొనసాగుతుందని హిమంత బిశ్వ శర్మ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,074 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బార్ పేటలో 128 మందిని, బిస్వనాథ్‌లో 139 మంది, ధుబ్రిలో 127 మందిని పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
14 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకున్నందుకు వీరిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఒకవేళ భర్త వయస్సు కూడా 14 ఏండ్ల లోపు ఉంటే అతన్ని రీఫాం హోంనకు పోలీసులు తరలిస్తున్నారు.
అయితే తమ భర్తలను అరెస్టు చేయడంతో వారి భార్యలు ఆందోళనకు దిగుతున్నారు. తమ భర్తలను అరెస్టు చేస్తే తమ సంరక్షణ ఎవరు చూసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంలో దుబ్రి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తమ భర్తల అరెస్టులను నిరసిస్తూ పెద్ద ఎత్తున భార్యలంతా దుబ్రీ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి మహిళలను చెదరగొట్టారు.