టర్కీ, సిరియా దేశాల్లో భూకంప విలయానికి మరణించినవారి సంఖ్య 21 వేలకు పైగా పెరిగింది. సుమారు 79 వేలమంది గాయపడ్డారు. నేలమట్టమైన శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని సహాయక బృందాలు రక్షిస్తూనే ఉన్నాయి. తమకు అత్యవసర సాయం కావాలని ఈ రెండు దేశాలూ ముఖ్యంగా ఇండియాను కోరుతున్నాయి. ఇండియా నుంచి ఇప్పటికే సహాయ సామగ్రితో కూడిన ఆరు విమానాలు టర్కీ చేరుకున్నాయి. ఢిల్లీలోని సిరియన్ ఎంబసీ ప్రత్యేకంగా తమ వారిని ఆదుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.
విరాళాల రూపంలో తమకు తోచినంత సాయం చేయాలని భారతీయులకు విజ్ఞప్తి చేసింది. ఇక సిరియా కోసం తాము మరో రెండు బోర్డర్ క్రాసింగ్స్ ని ఓపెన్ చేస్తామని టర్కీ విదేశాంగ మంత్రి ప్రకటించారు. తాము ఈ ప్రకృతి వైపరీత్యానికి గురైనప్పటికీ సిరియాకి మొదట విడతగా సహాయ సామాగ్రిని పంపుతున్నామని ఆయన వెల్లడించారు.
టర్కీలో 12 గంటల అనంతరం మళ్ళీ ట్విట్టర్ ను శుక్రవారం ఉదయం పునరుద్దరించినట్టు అధికారులు తెలిపారు. టర్కీలోని కొన్ని నగరాల్లో అసలు బతికి ఉన్నవారి జాడే కనబడడం లేదని ఓ టీచర్ వాపోయారు. ఒక్క తమ దేశంలోనే 16 వేలమందికి పైగా మృతి చెందారని ఆయన చెప్పారు.
ఐరాస నుంచి, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాలనుంచి టర్కీ, సిరియా దేశాలకు సాయం అందుతోంది. టర్కీలోని ఖరామన్మరాస్ సిటీలో నేలమట్టమైన భవనం నుంచి 73 గంటల అనంతరం అయిదేళ్ల పాపను, ఆమె తలిదండ్రులను సహాయక బృందాలు రక్షించాయి. టర్కీ బాధితుల కోసం తన నెల రోజుల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు తైవాన్ ప్రెసిడెంట్ సాయి ఇంగ్-వెన్ ప్రకటించారు.