దేశంలో కరోనా వ్యాప్తి స్థిరంగానే కొనసాగుతోంది. నిన్న 32 వేల కేసులు నమోదవగా.. ఇవాళ స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 31 వేల 521 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97 లక్షల 67 వేల 372కు చేరింది.
ఇక కరోనా కారణంగా నిన్న 412 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి లక్షా 41 వేల 772 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. మరోవైపు కరోనా బారి నుంచి ఇప్పటి వరకు 92.53 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3.72 లక్షలకు తగ్గింది.
కాగా దేశంలో కరోనా యాక్టివ్ కేసులు సెప్టెంబర్ నెల నుంచి భారీగా తగ్గుతూ వస్తున్నాయి. సెప్టెంబర్ 18న 10 లక్షలుగా ఉండగా.. అక్టోబర్ 8 నాటికి 9 లక్షలకు.. నవంబర్ 10 నాటికి 5 లక్షలకు.. డిసెంబర్ 6 నాటికి 4 లక్షల దిగువకు పడిపోయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.