కశ్మీర్ లో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. సుమారు 350 మంది ఉద్యోగులు, కశ్మీర్ పండిట్లు తమ ఉద్యోగాలకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ భట్ ను అతని కార్యాలయంలో ఉగ్రవాదులు శుక్రవారం హతమార్చడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఉద్యోగులు తమ రాజీనామా పత్రాలను జమ్ముకశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు అందజేశారు. కశ్మీర్ లో తమకు భద్రత కరువైందని, ఇకపై అక్కడ ఉద్యోగాలు చేయలేమని లేఖలో వారు వెల్లడించారు.
కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ ను చాదూరాలోని అతని కార్యాలయంలో ఉగ్రవాదులు కాల్చి చంపారు. కశ్మీర్ ప్రభుత్వం 2010-11లో ప్రవేశపెట్టిన వలసదారులకు ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ పథకం కింద ఆయనకు ఉద్యోగంలో చేరారు.
ఈ ఘటనపై కశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భట్ హంతకులను తీవ్రంగా శిక్షించాలని కశ్మీరి పండిట్లు డిమాండ్ చేస్తున్నారు. తమను సురక్షితమైన ప్రదేశాలకు తరలించాలని లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను లేఖలో కోరారు.