జేఈఈ మెయిన్స్ నాలుగో దశ పరీక్షల్లో గోల్‌మాల్ జరిగిందా? అక్రమ మార్గాల్లో కొందరు అభ్యర్థులు మెరుగైన ర్యాంకులను పొందారా? అంటే అవుననే అంటోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). దేశవ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాసిన 400 మంది జేఈఈ మెయిన్స్ అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవకతవకలకు పాల్పడి వారు మంచి మార్కులు సంపాదించారేమోనని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే ఈ అంశంపై సీబీఐ విచారణ కొనసాగుతుండగా.. నేషనల్ ఎన్టీఏ కూడా దర్యాప్తు చేస్తోంది.
మొదటిసారి ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌ను నాలుగు దశల్లో నిర్వహించారు . మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు నాలుగు సార్లు పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించారు. అయితే కొంత మంది విద్యార్థుల పర్సంటైల్ చివరి దశలో అనూహ్యంగా 50 నుంచి 90 శాతానికి వరకు పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మొదటి మూడు దశల్లో తక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు నాలుగో దశ పరీక్షలో అనూహ్యమైన పెరుగుదలను నమోదు చేయడంపై కొంత అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ఎన్టీయే సీరియస్‌గా ఈ అంశాన్ని పరిశీలిస్తోంది.
ప్రధానంగా చివరి నిమిషంలో పరీక్షా కేంద్రం మార్పు కోసం అడిగిన వారిలో చాలా మందికి పరీక్షలో అధికంగా మార్కులు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో అధిక మార్కుల కోసం వారు ఏవైనా ఎలక్ట్రానిక్ డివైస్‌లు వాడి ఉండటమో లేక.. తమకు బదులుగా ఇతరులతో పరీక్షలు రాయించి ఉండటమో జరిగి ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఏదేమైనా తప్పు చేసినట్టుగా తేలితే.. NTA నిబంధనల ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.