మనిషికి నిషాయిచ్చేది మందు.సంతోషానికి మందు, విషాదానికి మందు.మామూలోణ్ణి నాయకుణ్ణిచేసేది మందు.రాష్ట ఖజానా నింపేది మందు.ఇది లేకుండా ఏదీ జరగదు.అసలిది లేకుండా సంపూర్ణ మధ్యపాన నిషేధం కూడా జరగదు.అంతటా నేనుంటానంటుంది. అందరికీ నేను కావాలంటుంది. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో కూడా ఇప్పుడు భారీగా మందు అందుబాటులోకి వచ్చింది. విదేశాల నుంచి దొడ్డిదారిన రాష్ట్రంలోకి వచ్చి పట్టుబడింది.
రాష్ట్రంలోని ఆరా జిల్లా బలువాలో లగ్జరీ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా 600 బాటిళ్ల మద్యాన్ని సీజ్ చేశారు. విదేశీ మద్యాన్ని సగ్లింగ్ చేస్తున్నారన్న నిర్ధిష్టమైన సమాచారంతో తనిఖీలు నిర్వహించామని జిల్లా ఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు.
పట్టుబడినవాటిలో బ్లెండర్ ప్రైడ్ 38 బాటిళ్లు, రాయల్ స్టాగ్ 20 బాటిళ్లు, 8పీఎం బాటిళ్లు 576 ఉన్నాయని చెప్పారు. కాగా, స్మగ్లర్లు కారును వదిలేసి పారిపోయారని వెల్లడించారు. అయితే ఈ వ్యవహారంలో ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేశామన్నారు. రాష్ట్రంలోని సివాన్ జిల్లాలోని గ్రామంలో కల్తీ మద్యం తాగడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే.
మరో ఆరుగురు తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. బాధితులు సివాన్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నారని జిల్లా మేజిస్ట్రేట్ అమిత్ కుమార్ పాండే తెలిపారు. అనుమానాస్పద స్థితిలో ముగ్గురు మృతిచెందారని, మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.