టర్కీ, సిరియాలలో భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఎటు చూసినా శిథిలాలూ, బయటపడుతున్న మృతదేహాలు, సున్నాకు పడిపోయిన ఉష్ణోగ్రతలతో గజగజ వణికిస్తున్న చలి.. ప్రస్తుతం ఈ దేశాల్లోని అత్యంత దయనీయమైన పరిస్థితి ఇది. ఇప్పటివరకు 7,800 మందికి పైగా మరణించారన్నది అధికారిక లెక్కలు కాగా.. 20 వేలమందికి పైగానే మృతి చెంది ఉండవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. 23 మిలియన్లమంది భూకంపానికి గురి కావచ్చునని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విపత్కర సమయంలో దాదాపు 80 శాతం మంది జనాభాకు అత్యవసరంగా మానవ సాయం అవసరమని, ప్రపంచ దేశాలు వీరిని ఆదుకోవాలని పిలుపునిచ్చింది.
ఈ రెండు దేశాల్లో భారీ భూకంపం తరువాత కూడా 200 కు పైగా భూప్రకంపనలు సంభవించాయి. నేలమట్టమైన భవన శిథిలాల కింద సజీవంగా ఉన్నవారిని రక్షించేందుకు 25 వేల సహాయక బృందాలు అహర్నిశం శ్రమిస్తున్నాయి. ఒక్క టర్కీలోనే సుమారు ఐదున్నర వేలమంది, సిరియాలో దాదాపు 2 వేలమంది మృతి చెందినట్టు అంచనా. గాయపడినవారి సంఖ్య లెక్కేలేదు. శిథిలాల కింద చిక్కుకున్న తమవారికోసం పెను విపత్తు నుంచి బయటపడినవారు చేస్త్తున్న ఆర్తనాదాలు కలచివేస్తున్నాయి. చలిగాలులు, వర్షపాతం వల్ల సహాయక బృందాలు మారుమూల ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నాయి.
ఏ ఒక్కరూ తమను ఆదుకోవడానికి రాలేకపోతున్నారని ఈ ప్రాంతాలవారు అల్లాడిపోతున్నారు. చలి బారి నుంచి తమ బిడ్డలను రక్షించుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ దేశంలో మూడు నెలల పాటు ఎమర్జెన్సీ ప్రకటించారు.
అమెరికా, రష్యా, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు టర్కీ, సిరియా దేశాలకు అత్యవసర సాయాన్ని అందిస్తున్నాయి. ఇండియా నుంచి అప్పుడే రెండో విమానం సహాయక సామగ్రితో ఈ దేశాలకు చేరుకుంది. సహాయక బృందాలతో బాటు శిక్షణ పొందిన డాక్టర్లు, పారామెడికోలు కూడా టర్కీ, సిరియా దేశాలకు చేరుకున్నారు. భారత ఆర్మీ నుంచి 45 మంది మెడికల్ టీమ్ టర్కీలోని శానిల్ ఉర్ఫా నగరానికి చేరుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 76 దేశాల నుంచి, 14 అంతర్జాతీయ సంస్థల నుంచి తమకు సహాయం అందడం ప్రారంభమైందని టర్కీ విదేశాంగ మంత్రి మేవ్లుట్ కవుసొగ్లు తెలిపారు.