దాయాది దేశం పాకిస్తాన్ పేరిట ఉన్న 18 ఏండ్ల రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఒకే సమయంలో అత్యధిక మంది జాతీయ జెండాను ఊపినట్టుగా పాక్ పేరిట ఉన్న రికార్డును భారత్ తిరగరాసింది. బీహార్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరైన ఓ సభలో ఏక కాలంలో 78000 పైగా మంది జాతీయ జెండాలను ఊపి ఆదివారం రికార్డును సృష్టించారు.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857లో జరిగిన తిరుగుబాటులో పాల్గొన్న వీరుడు వీర్ కున్వర్ సింగ్ 164వ వర్ధంతి సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
పాల్గొన్నారు.
ఆయనతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, మరో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, డిప్యూటీ సీఎం తార్ కిషోర్, రేణు దేవీ, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీలు పాల్గొన్నారు. వీరితో పాటు సమావేశానికి హాజరైన ప్రజలు కలిసి 5 నిమిషాల పాటు జాతీయ జెండాను రెపరెపలాండించారు. ఈ సమయంలో వందేమాతర గీతాన్ని ప్లే చేశారు.
ఈ కార్యక్రమంలో అమిత్ షా సమక్షంలో ఏకకాలంలో 75000 త్రివర్ణ పతాకాలను ఎగురవేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతకు ముందు 2004లో లాహోర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో 56,000 మంది పాకిస్థానీయులు తమ జాతీయ జెండాను రెపరెపలాడించడంతో రికార్డును నెలకొల్పింది.